హైదరాబాద్: టీవీ9 లోగో విక్రయం విషయంలో  ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్‌ను  బంజారాహిల్స్ పోలీసులు  ఆరు గంటల పాటు విచారించారు. ఈ విచారణ సమయంలో పోలీసులకు రవిప్రకాష్ పొంతనలేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది.అయితే శనివారం నాడు సంబంధిత డాక్యుమెంట్లను తీసుకురావాలని రవిప్రకాష్‌కు  పోలీసులు సూచించారు. శనివారం నాడు మరోసారి రవిప్రకాష్‌ను పోలీసులు విచారించే అవకాశం ఉంది.

టీవీ 9 లోగో విక్రయం విషయంలో ట్రేడ్ మార్క్, కాపీ రైట్స్‌ను ఉల్లంఘించినట్టు రవిప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై శుక్రవారం నాడు బంజారాహిల్స్ పోలీసుల ఎదుట ఆయన విచారణకు హాజరయ్యారు. 

రూ. 99 వేలకు టీవీ 9 లోగోను మోజో టీవీకి అక్రమంగా విక్రయించినట్టు ఫోర్జరీ పత్రాలు, తప్పుడు సంతకాలతో మోసం చేశాడని రవిప్రకాష్ పై అలంద మీడియా డైరెక్టర్  కౌశిక్ రావు గత నెలలో బంజారాహిల్స్ పోలీసల్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌ను విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల ఆధారంగా శుక్రవారం నాడు ఉదయం 11 గంటలకు రవిప్రకాష్  హాజరయ్యారు.  

బంజారాహిల్స్ ఏసీపీ కేఎస్ రావు, ఇన్స్‌పెక్టర్ కళింగ్ రావుల బృందం రవిప్రకాష్‌ను విచారించింది. ఈ కేసు విషయమై  పోలీసులు పలు ప్రశ్నలను రవిప్రకాష్‌కు సంధించారు.  అయితే రవిప్రకాష్  సరైన సమాధానాలు చెప్పలేదని సమాచారం. అది నా సంస్థ, ఆ హక్కు నాకు ఉంది అంటూ టీవీ 9 లోగో విక్రయానికి సంబంధించి రవిప్రకాష్ పోలీసుల విచారణలో వెల్లడించినట్టుగా సమాచారం.

అయితే లోగోకు సంబంధించిన డాక్యుమెంట్లను తీసుకురావాలని పోలీసులు రవిప్రకాష్‌ను ఆదేశించారు. శనివారం నాడు పూర్తి డాక్యుమెంట్లతో కలిసి రావాలని కోరారు. ఫోర్జరీ, నిధుల మళ్లింపు వ్యవహారంలో పోలీసులు కేసు వేగవంతం చేశారు. రవిప్రకాశ్‌ను అరెస్టు చేసే దిశగా పోలీసులు పావులు కదుపుతున్నారు. ఈ విషయంలో న్యాయనిపుణుల సలహా కూడా అడిగిన పోలీసులు శనివారం అరెస్టుపై నిర్ణయం తీసుకోనున్నారు.