పారిశ్రామిక వేత్త రాంప్రసాద్ హత్య కేసులో మరో పారిశ్రామిక వేత్త కోగంటి సత్యం చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విచారణలో భాగంగా కోగంటి బెదిరింపులకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

2012లో ఖమ్మంలోని భక్తాంజనేయ ఆలయ భూములు కొనేందుకు రాంప్రసాద్ ప్రయత్నించారు. వీటి విలువ రూ.25 కోట్ల పైమాటే.. ఆలయ భూములు కావడంతో ముందుగా కోర్టులో రూ.2 కోట్లు డిపాజిట్ సైతం చేశారు.

అయితే ఆలయ భూములను రాంప్రసాద్‌కు ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.. అంతేకాకుండా రూ. 2 కోట్లను తిరిగిచ్చేయాలని సైతం ఆదేశించింది. ఇదే సమయంలో కోగంటి సత్యం కూడా ఖమ్మం కోర్టును ఆశ్రయించారు.

కామాక్షీ స్టీల్స్‌కు చెందిన డబ్బునే రాంప్రసాద్ ఆలయ భూములు కొనుగోలు చేయడానికి డిపాజిట్ చేశారని.. ఆ డబ్బులు తిరిగి కంపెనీకి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రాంప్రసాద్‌కు అనుకూలంగా అగ్రిమెంట్ ఉండటంతో ఆయనకే డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

న్యాయస్థానం ఆదేశాల మేరకు వారం రోజుల్లోనే రాంప్రసాద్ ఖాతాలో డబ్బులు డిపాజిట్ కానున్నాయి.. దీంతో ఆ సొమ్ము కోసం కోగంటి సత్యం వేధింపులు పెట్టినట్లుగా తెలుస్తోంది. గత నెల రోజుల నుంచి రాంప్రసాద్‌కు వేధింపులు ఎక్కువయ్యాయి.

ప్రస్తుతం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులో ఉన్న కోగంటి సత్యంను దీనిపై మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది. తనకు సైతం రూ.70 కోట్లు ఇవ్వాలని కోగంటి సత్యం మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. తాము ఊర శ్రీనివాస్ చెప్పడం వల్లే తాము రాంప్రసాద్‌ను హత్య చేసినట్లు సుపారీ గ్యాంగ్ చెప్పడంతో అనుమానాలు శ్రీనివాస్‌ వైపుకు వెళ్లాయి.