హైదరాబాద్: ఏపీ స్టీల్‌ వ్యాపారి తేలపోలు రాంప్రసాద్‌ హత్య కేసులో కోగంటి సత్యాన్ని  హైదరాబాదు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాదులోని పంజగుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన రాంప్రసాద్ హత్య కేసు తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. 

రాంప్రసాద్‌ హత్య కేసులో కోగంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే రాంప్రసాద్‌ను తామే హత్య చేశామంటూ శ్యాం ముఠా మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఈ హత్య వెనుక కోగంటి సత్యం పాత్ర ఉందని భావించి సుపారీ గ్యాంగ్‌తో రాంప్రసాద్‌ను హత్య చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు కోగంటి సత్యాన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనను సికింద్రాబాద్‌లోని టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయానికి తరలించారు.
 
రాంప్రసాద్‌ (49) హత్యకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఆయన హత్యలో విజయవాడ వ్యాపారి, కామాక్షి స్టీల్‌ ట్రేడర్స్‌ అధినేత కోగంటి సత్యం హస్తం ఉందని ప్రచారం సాగుతోంది. శనివారం రాత్రి పంజాగుట్టలో రాంప్రసాద్‌ హత్యకు గురయ్యారు. ప్రతివారం మాదిరే ఆయన హైదరాబాద్‌ పంజాగుట్ట దుర్గాకాలనీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ముగించి బయటకు వచ్చారు. 

తన ఆఫీసుకు నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో ఓ మలుపు వద్ద ముగ్గురు ఆగంతకులు ఆయనను అడ్డుకొని కత్తులతో దాడి చేశారు. తల, మెడ ఇతర శరీరభాగాలపై నరకడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆయన్ను హుటాహటిన సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ అర్ధరాత్రి మృతిచెందారు.
 
రాంప్రసాద్‌కు భార్య వైదేహీ, కుమారులు అఖిల్‌, నిహారీలు ఉన్నారు. విజయవాడ , పరిగి, ఒంగోలు తదితర ప్రాంతాల్లో రాంప్రసాద్‌ స్టీల్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. సత్యంతో ఆర్థిక లావాదేవీల పరంగా వివాదం నెలకొనడంతో రాంప్రసాద్‌ భార్య వైదేహీ ఆందోళన చెందారు. 

భార్య ఒత్తిడితో ఆయన 2015లో హైదరాబాద్‌కు మకాం మార్చారు. కుటుంబంతో కలిసి పంజాగుట్ట దుర్గానగర్‌ కాలనీలో ఉంటూ అక్కడి నుంచే వ్యాపారం సాగిస్తూ వస్తున్నారు.