ఎండ వేడి, ఉక్కపోతలతో అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. తూర్పు జిల్లాల్లో రానున్న రెండు రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

మిగతా జిల్లాల్లో మాత్రం పొడి వాతావరణం నెలకొంటుందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది.

నిన్నటి ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్‌గఢ్‌, దాని పరిసర ప్రాంతాల్లో స్థిరంగా కొనసాగుతూ సముద్ర మట్టం నుంచి 2.1 కి.మీ. వరకు వ్యాపించి ఉన్నట్లు తెలిపింది.  

మరోవైపు తెలంగాణలో ఎండలు దంచి‌కొ‌డు‌తు‌న్నాయి. ఆది, సోమ‌వా‌రాల్లో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని, గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధా‌రణం కంటే 3 డిగ్రీల మేర పెరిగే అవ‌కాశం ఉందని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం ఇన్‌చార్జి డైరె‌క్టర్‌ నాగ‌రత్న తెలి‌పారు.

మంచి‌ర్యాల, పెద్దపల్లి, జయ‌శం‌కర్‌ భూపా‌ల‌పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యా‌పేట, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నాగ‌ర్‌‌క‌ర్నూల్‌, జోగు‌లాంబ గద్వాల, వన‌పర్తి, నారా‌య‌ణ‌పేట తది‌తర జిల్లాల్లో ఆది‌వారం వడ‌గా‌డ్పులు వీచే అవ‌కాశం ఉందని చెప్పారు