పరిగి: నీరు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడ్డ తెలంగాణను కేసీఆర్ మోసం చేశారని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పరిగి నియోజకవర్గంలో ప్రజాకూటమి ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న రాహుల్ టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. 

తెలంగాణను అన్ని రంగాల్లో టీఆర్ఎస్ మోసం చేసిందని రాహుల్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆదాయాన్ని ప్రజలకు పంచకుండా కేసీఆర్ కుటుంబమే దోచుకుందని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న మిషన్ భగీరథ పథకంలో భారీ అవినీతి చోటు చేసుకుందన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క ఎకరం కూడా ఇవ్వలేదని విమర్శించారు. భూమి ఇవ్వకపోగా దళితులు, గిరిజనుల భూములను కబ్జా చేశారన్నారు. ఆఖరికి దేవుడి భూమలను కూడా వదల్లేదని ఆరోపించారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు కన్న కలలు నెరవేరుస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇళ్లు నిర్మిస్తామని, ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నీటి సమస్యలు రాకుండా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. 

అలాగే పేద ప్రజలు కార్పొరేట్ వైద్యం అందించేందుకు వీలుగా వైద్యానికి అయ్యే ఖర్చు రూ.5లక్షలు ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు రూ.3వేలు భృతి కల్పిస్తామన్నారు. కేసీఆర్ ఫాం హౌస్ లో నిద్రపోతే యువతకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 

సీఎం కేసీఆర్ ఆదివాసీలను ఘోరంగా మోసం చేశారని రాహుల్ విమర్శించారు. జల్ జంగల్ జమాన్ నినాదంతో గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేసిందని రాహుల్ గుర్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ జల్ జంగల్ జమాన్ పథకం ద్వారా గిరిజనులకు భూ పట్టాలు పంపిణీ చేస్తామన్నారు.

ఎస్సీల అభివృద్ధికి ప్రత్యేక బిల్లును తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడతామన్నారు. ఎస్టీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను కేసీఆర్ అమలు చేసి ఉంటే గిరిజనులు దళితులు ఎంతో అభివృద్ధి చెందేవారన్నారు. కానీ కేసీఆర్ అలా చెయ్యకుండా చోద్యం చూశారన్నారు. 

మరోవైపు ప్రధాని నరేంద్రమోదీపైనా రాహుల్ గాంధీ విమర్శల వర్షం కురిపించారు. నరేంద్ర మోదీ జాతులు, మతాల మధ్య చిచ్చు పెట్టి విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా మోదీ మాట్లాడుతున్నారని రాహుల్ విమర్శించారు. 

కేసీఆర్,మోదీ ఇద్దరూ ఒక్కటేనని రాహుల్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో మోదీకి కేసీఆర్ అన్ని అంశాల్లో మద్దతు ప్రకటిస్తున్నారన్నారు. నోట్ల రద్దును సమర్ధించిన వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. జీఎస్టీ వల్ల బీడీ ఫ్యాక్టరీ యాజమాన్యం, చిన్న చిన్న వర్తకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే కేసీఆర్ మాత్రం జీఎస్టీకీ మద్దతు ప్రకటించారన్నారు. 

ఆ తర్వాత రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ బీజేపీకి మద్దతు పలికిందన్నారు. అలాగే పార్లమెంట్ లో ప్రతీ బిల్లుకు టీఆర్ఎస్ మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు మారిపోయిందని టీఆర్ఎస్ కు మరో ఎస్ చేర్చాలన్నారు. ఇకపై టీఆర్ఎస్ ఎస్ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ఆర్ఎస్ఎస్ గా టీఆర్ఎస్ మారిపోయిందన్నారు. 

దేశాన్ని మోదీ పాలించాలని తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్  కుటుంబం పాలించాలని ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం జరిగిందన్నారు.  నాలుగున్నరేళ్లలో మోదీ కేసీఆర్ ను ఒక్కసారి కడా విమర్శించలేదన్నారు. కేసీఆర్ నాలుగున్నేళ్లలో మోదీని పొగడటమే తప్ప ఏనాడు విమర్శించలేదన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. అలాగే రాజస్థాన్, మిజోరాం, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో బీజేపీని ఓడించాలన్నారు. 

నరేంద్రమోదీ, టీఆర్ఎస్ పార్టీలను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మోదీకి బీ, సీ టీమ్ లు అంటూ ఎద్దేవా చేశారు. ఎంఐఎం పార్టీకి ఓట్లు లేకున్నా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చేందుకు అభ్యర్థులను నిలబెడుతుందని రాహుల్ ఆరోపించారు. 

చీకటి ఒప్పంద పార్టీలను ప్రజలు ఖచ్చితంగా ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే తనకు తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం కలుగుతుందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిధులు నీళ్లు, నియామకాలు చేపడతామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్,బీజేపీలు లా హామీలు ఇచ్చి వదిలెయ్యమన్నారు. జన్ ధన్ ఖాతాలో 15 లక్షలు వేస్తామని బీజేపీలా అబద్దాలు చెప్పమని నిజమే చెప్తానన్నారు. అబద్దాలు మోదీ, కేసీఆర్ మీటింగ్ లలో ఉంటాయన్నారు.

ఈ ఎన్నికలు ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. రైల్వే లైన్ ను తీసుకొస్తామన్నారు. ప్రజాకూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని హామీ రాహుల్ కోరారు.