తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుకుచుకుపడ్డారు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ భూపాల్‌పల్లిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.

17 వేల కోట్ల మిగులు బడ్జెట్‌తో అవతరించిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాలు చేశారని రాహుల్ విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ఆయన చేసిన అప్పుల కారణంగా తెలంగాణలోని ప్రతి ఒక్కరికి లక్షా 50 వేల భారం పడిందన్నారు.

ఇదే క్రమంలో కేసీఆర్ తనయుడు కేటీఆర్ సంపాదన 400 శాతం పెరిగిందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ఆదివాసీ యూనివర్సిటీ ఇస్తామని కేసీఆర్ మాట ఇచ్చారు.. కానీ దానిని అమలు చేయలేదని రాహుల్ మండిపడ్డారు.

ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గిరిజన యూనివర్సిటీని స్థాపిస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన సింగరేణి కార్మికులకు కేసీఆర్ చాలా హామీలను ఇచ్చారని.. కానీ వీటిలో వేటిని నెరవేర్చలేదన్నారు.

 సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు, సస్పెండ్‌కు గురైన కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి రెగ్యులరైజ్ చేస్తుందని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ఇక్కడ జరిగే ప్రతి పని వల్లా ముఖ్యమంత్రి కుటుంబం, కాంట్రాక్టర్లకే లాభం జరుగుతుందన్నారు. రైతులకు కనీస మద్ధతు లేదని.. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించలేదన్నారు.