హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో కొందరు గతేడాది చోటు చేసుకున్న వరదలకు సంబంధించి వీడియోలను తాజాగా వైరల్ చేస్తున్నారు. ఇలాంటి వారికి రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ వార్నింగ్ ఇచ్చారు. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ముఖ్యంగా చిన్న వర్షానికే చెరువులను తలిపించే గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో తాజా భారీ వర్షాలతో ప‌లు కాల‌నీలు, రోడ్లు జ‌ల‌మ‌య‌మైన విషయం తెలిసిందే. అయితే, కొంద‌రు ఈ సందర్భంగా పాత వీడియోల‌ను సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తూ ప్ర‌జ‌ల్లో మ‌రింత భ‌యాందోళనలకు కారణమవుతున్నారు. నగరంలో భారీ వరదలు వచ్చాయని, ఇళ్లు కూలిపోతున్నాయంటూ పాత వీడియోలను కొత్త వీడియోలుగా చూపుతూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.

Also Read:శుక్ర, శనివారాల్లోనూ భారీ నుండి అతి భారీ వర్షాలు... తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

దీనిపై రాచకొండ సీపీ మహేష్‌ భగవత్ ఆగ్రహం వ్యక్తం చేశవారు. పాత వీడియోల‌ను కొత్తవిగా వైరల్‌ చేస్తూ భయాందోళనలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేస్తామ‌ని సీపీ పేర్కొన్నారు. కాగా, వర్షాల కారణంగా ఎవ‌రైనా ఎక్కడైనా ఇబ్బందులు ఎదుర్కొంటే డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాలని మహేశ్ భగవత్ విజ్ఞప్తి చేశారు. ఆ వెంటనే సంబందిత సిబ్బంది సాయం చేస్తార‌ని ఆయ‌న వివ‌రించారు. స‌హాయ‌క బృందాలు, పోలీసులకు స‌హ‌క‌రించాల‌ని సీపీ ప్రజలను కోరారు.