పెద్దపల్లి జిల్లా మంథని సామాజిక వైద్యశాలలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ రెండో విడత కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు.

"

అర్ధరాత్రి దాటిన తర్వాత రామగుండం కమిషనరేట్ పోలీసులు విచారణ అనంతరం వదిలిపెట్టిన తర్వాత ఈరోజు మంథనిలో వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనేకమంది కార్యకర్తలతో ప్రభుత్వ వాహనంలో సామాజిక వైద్యశాలకు చేరుకున్న పుట్టమధు రెండో విడత వాక్సినేషన్ వేయించుకున్నారు. ఆస్పత్రిలో ఉన్న ప్రజలతో మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. వాటిని పరిష్కరిస్తామని తెలిపారు.

పుట్ట మధు వెంట ఆయన భార్య పుట్ట శైలజ, కాటారం మార్కెట్ చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి, మంథని ఎంపీపీ కొండా శంకర్ తదితరులు ఉన్నారు.

కాగా, పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మెన్  పుట్ట మధుకు రామగుండం పోలీసులు మంగళవారం నాడు  నోటీసులు ఇచ్చారు. ఇవాళ విచారణకు  రావాలని ఆదేశించారు. మూడు రోజుల పాటు  విచారణ నిర్వహించిన పోలీసులు సోమవారం నాడు రాత్రి పుట్ట మధును ఇంటికి పంపారు. 

లాయర్  వామన్ రావు దంపతుల హత్య కేసులో  అందిన ఫిర్యాదు మేరకు  పుట్ట మధును పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ నిర్వహించారు. మంగళవారం నాడు  మరోసారి విచారణకు రావాలని  పోలీసులు పుట్టమధుకు పోలీసులు నోటీసులు ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకొంది.  

పుట్ట మధు భార్య మంథని మున్సిపల్ ఛైర్‌పర్సన్  శైలజను  కూడ పోలీసులు విచారించారు. లాయర్ వామన్ రావు దంపతుల హత్యకు  రెండు రోజుల ముందు  పుట్ట మధు తన బ్యాంకు ఖాతా నుండి సుమారు రూ. 2 కోట్లను డ్రా చేసిన విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

గత వారం రోజుల వరకు పుట్ట మధు అదృశ్యం కావడంపై కూడ పోలీసులు విచారణ నిర్వహించారు. ఏ కారణం చేత  పెద్దపల్లిని వదిలివెళ్లారనే విషయమై ఆరా తీశారు. మరో వైపు పుట్ట మధుతో పాటు మరో 12 బ్యాంకు ఖాతాల వివరాలపై  కూడ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ విషయాలపైనే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.