పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి రాఘవరెడ్డి కుటుంబానికి చెందిన వరకట్న వేధింపుల వివాదం మరోసారి  తెరమీదకు వచ్చింది. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. 

పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి రాఘవరెడ్డి కుటుంబానికి చెందిన వరకట్న వేధింపుల వివాదం మరోసారి తెరమీదకు వచ్చింది. రాఘవరెడ్డి కోడలు ప్రజ్ఞారెడ్డి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. రాఘవరెడ్డి, ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్యారెడ్డిల నుంచి తనను కాపాడాలంటూ ప్రజ్ఞారెడ్డి లేఖలో కోరారు. శీతకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఈ నెల 29న షేక్ పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు, అధ్యాపకులతో ముఖాముఖిలో పాల్గొననున్నారు. అయితే ఆ కాలేజ్‌తో పుల్లారెడ్డి కుటుంబానికి సంబంధం ఉంది. శ్రీవిద్యారెడ్డి ఈ కాలేజ్‌కు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రపతికి ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. 

రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డిలు గత రెండేళ్లుగా తనను, తన ఎనిమిదేళ్ల కుమార్తెను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. వారు గతంలో తనను వరకట్నం కోసం హింసించారని, తనను గదిలోంచి బయటికి రానివ్వకుండా రాత్రికి రాత్రే గోడ కట్టేశారని లేఖలో వివరించారు. కోర్టు స్పందించి, ఆ గోడ కూల్చేయాలని చెప్పిందని చెప్పారు. వారు తనను, తన కుమార్తెను చంపేందుకు ప్రయత్నించారని తన లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. తన అత్త భారతిరెడ్డిపై హైదరాబాదులో భూకబ్జా కేసులు కూడా ఉన్నాయని ఆరోపించారు. ఓ మహిళగా సాటి మహిళ వేదనను అర్థం చేసుకుంటారన్న ఆలోచనతో మీకు ఈ లేఖ రాస్తున్నానని చెప్పారు. తనకు, తన బిడ్డకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 

ఇక, పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి పుల్లారెడ్డి వారసుడిగా ఆయన కుమారుడు జి రాఘవరెడ్డి పుల్లారెడ్డి గ్రూప్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఆయన కుమారుడు ఏక్ నాథ్ రెడ్డికి 2014లో ప్రజ్ఞారెడ్డితో వివాహం జరిగింది. ప్రజ్ఞారెడ్డి తండ్రి కేఆర్ఎం రెడ్డి మైనింగ్ వ్యాపారంలో ఉన్నారు. అయితే ఏక్‌నాథ్ రెడ్డి కుటుంబ సభ్యులు తనను వేధిస్తున్నారని ప్రజ్ఞారెడ్డి కొన్ని నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే ఏక్‌నాథ్ రెడ్డితో పాటు రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీవిద్యారెడ్డిలపై గృహహింస చట్టం కింద కేసు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. వారు తనను, తన కుమార్తెను బేగంపేటలోని వారి ఇంట్లో ఆహారం, నీరు అందించకుండా నిర్బంధించారని ప్రజ్ఞారెడ్డి ఆరోపించారు. అతి కష్టం మీద తాను పోలీసులకు ఫోన్ చేశానని చెప్పారు. 

‘‘నాకు 2014 మార్చిలో బెంగళూరులోని ఓ స్టార్ హోటల్‌లో ఏకనాథ్‌రెడ్డితో వివాహం జరిగింది. రూ. 55 లక్షల కంటే ఎక్కువ విలువైన బంగారు నగలు, వెండి వస్తువులతో పాటు రూ.75 లక్షల నగదును కట్నంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత తన భర్త బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నాడని తెలిసింది.పెళ్లి సమయంలో ఆ విషయం మాకు చెప్పలేదు. నేను నా తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు కావడంతో అదనపు కట్నంగా కమర్షియల్‌ ఆస్తిని కొనుగోలు చేయాలని పుల్లారెడ్డి కుటుంబీకులు నా తల్లిదండ్రులను డిమాండ్‌ చేశారు. అయితే వారు నిరాకరించడంతో బెదిరించారు. ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ వేశారు. నా అత్తమామలను ఇంటి నుంచి గెంటేయకుండా నిరోధించాలని నేను వేసిన మధ్యంతర పిటిషన్లు, భరణం కోసం వేసిన మరొక పిటిషన్ ఇప్పటికీ తీర్పు కోసం పెండింగ్‌లో ఉంది.

నా అత్తమామలు నన్ను ఇంటి నుండి వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మే 10 న నా భర్త , అత్తమామలు నన్ను దిండుతో ఉక్కిరిబిక్కిరి చేసి చంపడానికి ప్రయత్నించారు. అయితే నేను తప్పించుకోగలిగాను. ఈ విషయంపై నేను పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించినప్పుడు.. వారు నా కుమార్తెను చంపేస్తామని బెదిరించారు. షాకింగ్‌గా వారు ఇంటి మొదటి అంతస్తులో రాత్రిపూట గోడను నిర్మించారు. నేను, నా కూతురు బయటకు వెళ్లకుండా నిర్బంధించారు. అనంతరం ఇంటికి తాళం వేసి అదృశ్యమయ్యారు. నీరు, ఆహారం లేవు. అతి కష్టం మీద పోలీసులకు ఫోన్ చేయడంతో వారు నన్ను రక్షించారు’’ అని ప్రజ్ఞారెడ్డి ఆ సమయంలో ఫిర్యాదులో పేర్కొన్నారు.