హైదరాబాద్‌: హైదరాబాదులోని పంజగుట్టలో హత్యకు గురైన పారిశ్రామికవేత్త రాంప్రసాద్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. హంతకులు వాడిన కారను పోలీసులు గుర్తించారు. రాంప్రసాద్ ను హత్య చేసిన తర్వాత హంతకులు బొలేరో వాహనంలో పారిపోయినట్లు తెలుసుకున్నారు.

రాంప్రసాద్ హత్య కేసులో కారు యజమానిని అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నించారు. మూడేళ్ల క్రితమే తాను కారును అమ్మినట్టు  యజమాని తెలిపాడు. ఇప్పుడు ఆ కారును ఎవరు వాడుతున్నారో తెలియదని చెప్పాడు.
 
కాగా, రాంప్రసాద్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కోగంటి సత్యంపై రాంప్రసాద్‌ ఎలాంటి ఫిర్యాదు చేయలేదని విజయవాడ కమిషనర్ ద్వారకా తిరుమలరావు చెప్పారు.విచారణ కోసమే కోగంటి అల్లుడ్ని హైదరాబాద్‌ పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. 

తెలంగాణ పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని ఆయన అన్నారు. కోగంటి సత్యంపై 24 కేసులు ఉన్నాయని చెప్పారు. ప్రస్తుతం కోగంటి సత్యం ఎక్కడున్నాడో తెలియదని, తెలంగాణ పోలీసులు కోరితే అతని జాడ కనిపెట్టడానికి సహకరిస్తామని చెప్పారు.