తెలంగాణ ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం కారణంగా 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్ధులు బలవన్మరణాలకు పాల్పడిన ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్ధుల ఆత్మహత్యలపై తక్షణం నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన తెలంగాణ సీఎస్‌ను ఆదేశించారు.

ఇంటర్‌బోర్డు వైఖరిని నిరసిస్తూ, విద్యార్ధుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ నేతృత్వంలోని బృందం ఈ నెల 1న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ను కలిసి వినతి పత్రం అందజేసింది.  

తీవ్ర మానసిక వేదన కలిగించడం ద్వారా ప్రభుత్వ సంస్థలే అమాయక విద్యార్ధుల జీవించే హక్కును హరించి వేశాయని.. అయినా ఏమీ జరగలేదంటూ ప్రభుత్వం తేల్చేసిందని వివరించారు.

రాష్ట్రపతి జోక్యాన్ని కోరడం తప్పించి మరో మార్గం లేదని లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ విచారణ జరిగితేనే నిజానిజాలు బయటకు వస్తాయని భావిస్తున్నామని.. ఈ మేరకు గవర్నర్‌ను ఆదేశించాలని బృంద సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు.

ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ స్పష్టంగా నివేదిక ఇచ్చినా ఎవరిపైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. దీనిపై స్పందించిన రాష్ట్రపతి భవన్.. తక్షణమే ఈ ఘటనకు సంబంధించిన నివేదిక ఇవ్వాల్సిందిగా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

కాగా.. ఈ ఏడాది విడుదలైన ఇంటర్ ఫలితాలు తప్పుల తడకగా వెలువడిన సంగతి తెలిసిందే. జిల్లా టాపర్లు, మెరిట్ విద్యార్ధులు సైతం పరీక్షల్లో ఫెయిలవ్వగా.. ఎంతోమందికి సున్నా మార్కులు వచ్చాయి.

ఫలితాలతో మనస్తాపానికి గురైన సుమారు 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు.

దిగివచ్చిన ప్రభుత్వం ఇంటర్ ఫలితాలపై త్రిసభ్య కమిటీని నియమించింది. ఈ కమిటీ సైతం ఇంటర్ బోర్డుకు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థదే తప్పంటూ తేల్చింది.