నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. 12 రోజుల పాటు సాగే ఈ పుష్కరాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు.
నేటి నుంచి ప్రాణహిత పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. 12 రోజుల పాటు సాగే ఈ పుష్కరాలు.. ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. చివరగా.. 2010లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాణిహిత పుష్కరాలను నిర్వహించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) నాటి ఆదిలాబాద్ జిల్లాలో భాగమైన అర్జునగుట్ట వద్ద ప్రాణహిత పుష్కరాలను ప్రారంభించి.. పుష్కర స్నానం ఆచరించారు. 12 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు స్వరాష్ట్రంలో నిర్వహించే పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అర్జునగుట్ట వద్ద పుష్కరాలను ప్రారంభించనున్నారు. ఈ క్రమంలోనే ప్రాణహిత నది విశేషాలను, పుష్కర ఘాట్లకు సంబంధించిన వివరాలను ఒకసారి చూద్దాం.
ప్రాణహిత నది గోదావరి నది ఉప నది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లోని తుమ్మిడిహెట్టికి పైభాగంలో పెన్‌గంగ, వార్ధా నదుల కలయికతో ప్రాణహిత ఏర్పడుతుంది. తుమ్మిడిహెట్టి నుంచి ప్రాణహిత ప్రయాణం మొదలై కాళేశ్వరం వరకు ప్రవహిస్తుంది. కాళేశ్వరం దగ్గర గోదావరిలో ప్రాణహిత, సరస్వతి నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడుతుంది. ప్రాణహిత నది ఎక్కువగా తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులో ప్రవహిస్తున్నది. ఒకరకంగా చెప్పాలంటే ప్రాణహిత నది తెలంగాణలో పుట్టి.. ఇక్కడే ముగుస్తుంది.
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో Pranahita pushkaralu జరగనున్నాయి. Komaram Bheem Asifabad జిల్లాలోని కౌటాల మండలం తుమ్మిడిహెట్టి, మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలం అర్జునగుట్ట, వేమనపల్లి, Bhupalpally జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్లను ఏర్పాటు చేశారు. కాళేశ్వరంలోని త్రివేణి సంగమం వద్ద సాధారణ ప్రజల కోసం, వీఐపీల కోసం వేర్వేరుగా ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ప్రాణహిత నదికి అవతలి వైపు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో.. అక్కడి సర్కార్ ప్రాణహిత పుష్కరాలకు ఏర్పాట్లు చేసింది. అయితే పుష్కారాల కోసం కాళేశ్వరం త్రివేణి సంగమం వద్దకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చే ఉంది. నదిలో పుణ్య స్నానం ఆచరించిన భక్తులు.. కాళేశ్వర-ముక్తీశ్వర స్వామిని దర్శించుకోనున్నారు.
ఇక, పుష్కరాల సమయంలో ప్రజలు.. నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, మొక్కులు తీర్చుకోనున్నారు. పితృదేవతలకు పిండ ప్రదానాలు, వారి పేరిట దానాలు చేస్తుంటారు. పుష్కరాల నేపథ్యంలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సిద్దమైంది. ప్రాణహిత పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుందని టీఎస్‌ఆర్‌టీసీ కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వీ వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. కరీంనగర్ జోన్ పరిధిలోకి వచ్చే కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం రీజియన్‌లలో ఈ సర్వీసులు నడపబడతాయని చెప్పారు. ప్రజలు సురక్షితంగా కాళేశ్వరం చేరుకోవడానికి ఆర్టీసీ కల్పిస్తున్న అవకాశాన్ని వినియోగించుకోవాలని వెంకటేశ్వర్లు కోరారు.
ఇక, వరంగల్ నుంచి కాళేశ్వరం వరకు సుమారు 200 బస్సులను నడుపనున్నట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అదేవిధంగా కాళేశ్వరం నుంచి పుష్కరఘాట్ వరకు 10 మినీ బస్సుల ద్వారా భక్తులకు ఉచిత ప్రయాణం కల్పించనున్నారు. అయితే పుష్కరాలను ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. పుష్కరాల ఏర్పాట్ల కోసం అవసరమైన నిధుల కోసం ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వం ఎలాంటి ప్రత్యేక కేటాయింపులు చేయకపోవడమే ఇందుకు కారణం.
