హైదరాబాద్: ప్రజాఫ్రంట్ కామన్‌ మినిమం ప్రోగ్రామ్‌ను విడుదల చేసింది. ఈ ప్రజా ఫ్రంట్ కు కన్వీనర్ గా టీజేఎస్ అధినేత కోదండరామ్ కొనసాగనున్నారు. ఈ కామన్ మినిమం ప్రోగ్రామ్‌ను కన్వీనర్ కోదండరాం, పీసీసీ చీఫ్ ఉత్తకుమార్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ  విడుదల చేశారు. 
 
 తెలంగాణ రాష్ట్రంలో నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని ప్రజాఫ్రంట్ కన్వీనర్ కోదండరామ్ ఆరోపించారు. అవినీతి నిర్మూలన ప్రత్యేక అంశంగా కామన్ మినిమమ్ ప్రోగ్రాం ఉంటుందని చెప్పారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో పాటు జిల్లాల అభివృద్ధిపై కూడా ప్రత్యేక దృష్టి సారించేలా కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ ను రూపొందించినట్లు కోదండరామ్ తెలిపారు. 

కుటుంబంలో భార్యభర్తలద్దరికీ పెన్షన్‌ ఇస్తామని అందులో ఎలాంటి సందేహమే లేదని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కేసీఆర్‌లా కుటుంబంలో ఒకరికి ఇచ్చి భార్యభర్తల మధ్య తగువులు పెట్టమని హామీ ఇచ్చారు.  
 
కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో ఆచరణ సాధ్యమైన హామీలనే పొందుపరచినట్లు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ చెప్పారు. కేసీఆర్ విస్మరించిన రంగాలకు ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ బోర్డులను మరింత పటిష్ఠం చేస్తామని, వ్యవసాయానికి పెద్దపీట వేస్తామని చెప్పుకొచ్చారు.  
 
ప్రజా కూటమి కామన్ మినిమం ప్రోగ్రామ్‌ వివరాలు ఇలా ఉన్నాయి. 
కర్నాటక తరహాలో ప్రత్యేక లోకాయుక్త
భారీ కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణ
పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తాం
తెలంగాణ ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేత
తొలిదశ ఉద్యమకారులకు పెన్షన్‌ ఆలోచిస్తున్నాం
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు పాలన భాగస్వామ్యం
ఈబీసీ వర్గాలకు కార్పొరేషన్
సంవత్సరంలోగా లక్ష ఉద్యోగాల భర్తీ
కాంట్రాక్ట్ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం
సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు బోర్డు
మద్దతు ధర అమలు
ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
చిన్న సన్నకారు రైతులకు బీమా
ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం
ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్‌ కాలేజీ
పాఠశాల విద్య బలోపేతం కోసం స్వయంప్రత్తి గల కమిషనరేట్‌
పాత విధానంలో విద్యుత్‌ చార్జీలు
ఇంటి పన్ను క్రమబద్దీకరణ
సింగరేణికి అనుబంధంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలు
సింగరేణిలో ఓపెన్‌ కాస్ట్‌ ఉండదు
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడం
రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ
వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు
చేనేత, బీడీ కార్మికులకు రూ.2 వేల పెన్షన్‌
పెన్షనర్ల అర్హత వయసు 60 నుంచి 58కి తగ్గింపు
వికలాంగులకు రూ.3 వేల పెన్షన్‌
కుటుంబంలో భార్యభర్తలద్దరికీ పెన్షన్‌