సూపర్ స్ప్రెడర్ గా పోస్ట్ మ్యాన్: తెలంగాణలో ఒకే ఊర్లో 110 మందికి కరోనా
2500 జనాభా కలిగిన ఊరిలో 110 మంది వైరస్ బారినపడంతో అధికారులు గ్రామంలో కేసుల పెరుగుదల గురించి ఆరాతీసారు.
కరోనా నానాటికి వ్యాప్తి చెందుతూ పట్టణాల నుండి గ్రామాల్లోకి కూడా పాకుతుంది. తెలంగాణ వనపర్తి జిల్లాలోని చిన్నంబావి గ్రామంలో గత ఆరు రోజులుగా 110 కరోనా కేసులు నమోదవడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.
2500 జనాభా కలిగిన ఊరిలో 110 మంది వైరస్ బారినపడంతో అధికారులు గ్రామంలో కేసుల పెరుగుదల గురించి ఆరాతీసారు. వైరస్ బారిన పడినవాళ్లలో అధికులు వృద్ధులు, వితంతువులు. మరింత లోతుగా పరిశీలించి చూడగా వీరంతా పెన్షన్ ని తీసుకోవడానికి పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళినవారాణి తేలింది.
పోస్ట్ మ్యాన్ వెంకటేష్ దగ్గర ఎవరెవరైతే తన పింఛన్ ను తీసుకోవడానికి వెళ్లారో... వారంతా ఈ కరోనా వైరస్ బారినపడ్డారు. పోస్ట్ మాన్ వెంకటేష్ కరోనా లక్షణాలున్నప్పటికీ... పరీక్షా చేపించుకోకపోవడంతో... ఆయన ద్వారా గ్రామంలో ఈ వైరస్ వ్యాపించినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతానికి ఊరిలోని 110 మందిని ఐసొలేషన్ లో ఉంచి గ్రామపంచాయితీ వారికి బలవర్ధకమైన ఆహారాన్ని ఉచితంగా అందిస్తుంది. గ్రామంలోని వైద్య శాఖా అధికారులు వారిని పర్యవేక్షిస్తున్నారు.
గత ఆరు రోజుల నుండి గ్రామంలోని అనుమానితులకందరికి పరీక్షలు నిర్వహించి పాజిటివ్ వచ్చినవారిని ఐసొలేషన్ లో ఉంచి చికిత్సను అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలను ఐసొలేషన్ సెంటర్ గా మార్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా మారితే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.
గ్రామంలో కరోనా ను వ్యాప్తి చేసిన పోస్ట్ మ్యాన్ వెంకటేష్ కి.... వనపర్తిలో ఆర్ఎంపి గా పని చేస్తున్న తన సోదరుడి ద్వారా కరోనా సోకినట్టు అధికారులు గుర్తించారు. ఇకపోతే... తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా గత 24 గంటల్లో తెలంగాణలో 2795 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 14 వేల 483కు చేరుకుంది.
కాగా, గత 24 గంటల్లో తెలంగాణలో కోవిడ్ వ్యాధితో 8 మంది మరణించారు. దీంతో మరణాల సంఖ్య 788కి చేరుకుంది. గత 24 గంటల్లో కరోనా వ్యాధి నుంచి 872 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దాంతో ఇప్పటి వరకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 86095కు చేరుకుంది. తెలంగాణలో ఇంకా 27,600 యాక్టివ్ కేసులున్నాయి.
హైదరాబాదు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. గత 24 గంటల్లో జిహెచ్ఎంసీ పరిధిలో 449 కేసులు నమోదు కాగా, నల్లగొండ జిల్లాలో 164 కేసులు రికార్డయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 268 కేసులు నమోద్యయాయి. సిద్ధిపేట జిల్లాలోనూ కేసులు పెరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో గత 24 గంటల్లో 113 కేసులు నమోదయ్యాయి.