హైదరాబాద్‌: ఫోర్జరీ, నిధుల మళ్లింపు కేసుల్లో నిందితుడైన టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. మంగళవారం ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు కేసు విచారణ వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. 

 టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఫోర్జరీకి పాల్పడినట్టు అలంద మీడియా ఫిర్యాదు చేయడంపై కోర్టులో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సోమవారం హైకోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. విచారణ మంగళవారానికి వాయిదా వేశారు. 

రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది కోర్టును కోరారు. రవిప్రకాష్ సాక్షులను ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని, అందుకే బెయిల్‌ను నిరాకరించాలంటూ ఆయన హైకోర్టులో తన వాదన వినిపించారు. దేవేందర్‌ అగర్వాల్‌  రాజీనామా లేఖలో సంతకం ఫోర్జరీ చేసిన విషయాన్ని ఆధారాలతో సహా హైకోర్టుకు పోలీసులు చూపించారు. 

సాక్షులను ప్రలోభాలకు గురిచేస్తూ వారితో జరిపిన ఫోన్‌ చాటింగ్‌ స్క్రీన్ షాట్స్‌ను కూడా హోకోర్టుకు సమర్పించారు. రవిప్రకాశ్‌ విచారణకు సహకరించడంలేదని పోలీసులు తెలిపారు. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని, అందుకే రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వొద్దని పోలీసుల తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. 

రవిప్రకాశ్‌కు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది హైకోర్టును కోరగా.. ఏ ప్రాతిపదికన బెయిల్‌ మంజూరు చేయాలని హైకోర్టు ప్రశ్నించింది. ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు ఈ కేసు విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.