తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నూతన సచివాలయానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. అయితే ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి నూతన సచివాలయానికి వెళ్లేందుకు సిద్దమయ్యారు. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లపై సమాచారాన్ని అడిగేందుకు సచివాలయానికి వెళ్లాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈరోజు నూతన సచివాలయానికి వెళ్లాలని బయలుదేరారు. అయితే రేవంత్ రెడ్డిని పోలీసులు టెలిఫోన్ భవన్‌ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే పోలీసులు తనను సచివాలయానికి తీసుకెళ్లాలని అన్నారు. తనను సచివాలయానికి ఎందుకు అనుమతించడం లేదని ప్రశ్నించారు. తాను ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల అవకతవకలపై అధికారిని కలిసి ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్నానని చెప్పారు. తాను సచివాలయానికి వెళ్తే పోలీసులకు వచ్చే నష్టమేమిటని ప్రశ్నించారు. తనను సచివాలయానికి అనుమతించేవరకు రోడ్డుపైనే కూర్చొంటానని అన్నారు. 

తాను సచివాలయానికి సమాచారం అడగడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఎంపీగా తాను సచివాలయం వెళ్లడానిక ఎలాంటి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఆఫీసు అవర్స్‌లో సచివాలయానికి వెళ్తున్నానని.. అలాంటప్పుడు తనను అడ్డుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రేవంత్ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెెలకొన్నాయి. 

మరోవైపు పోలీసులు సచివాలయం విజిటర్స్ గేట్‌ను మూసివేశారు. అలాగే సచివాలయం గేట్ల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఒకవేళ రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సచివాలయం వద్దకు చేరుకుంటే.. వారిని తరలించేందుకు వ్యాన్లను కూడా సిద్దంగా ఉంచారు. 

ఇదిలా ఉంటే.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు కాంట్రాక్ట్‌ను 30 ఏళ్లపాటు కేవలం రూ. 7,380 కోట్లకు ప్రైవేట్‌ ఏజెన్సీకి అప్పగించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. ఇందులో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ‘‘గత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన 155 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్‌ను కేసీఆర్ ప్రభుత్వం ప్రైవేట్ ఏజెన్సీకి విక్రయించింది. 30 సంవత్సరాలలో ఓఆర్‌ఆర్‌పై ఇతర రకాల ఆదాయ ఉత్పాదక పద్ధతుల్లో టోల్ ద్వారా దాదాపు రూ. 30,000 కోట్లు సంపాదించవచ్చు. ఓఆర్‌ఆర్‌పై ప్రతిరోజూ 2 కోట్ల టోల్ వసూళ్లు జరుగుతున్నాయి’’ అని రేవంత్ అన్నారు.