హైదరాబాద్:చేవేళ్ల కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కోసం పనిచేస్తున్న సందీప్ అనే వ్యక్తిని పోలీసులు బుధవారం నాడు అదుపులోకి తీసుకొన్నారు.హైద్రాబాద్‌లోని గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ టవర్స్‌లో సందీప్‌రెడ్డిని  పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. మంగళవారం రాత్రి సందీప్ రెడ్డిని ఐటీ అధికారులు విచారించినట్టు సమాచారం.

సందీప్ రెడ్డి ఇప్పటికే రూ. 15 కోట్లను పంచినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. సందీప్ రెడ్డి  ఎవరెవరికి ఎంతెంత డబ్బులను ఇచ్చారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

ఈ మేరకు సందీప్ నుండి కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నారు. సందీప్ రెడ్డి కోడ్ పద్దతిలో రాసుకొన్న కాగితాలను పోలీసులు  స్వాధీనం చేసుకొన్నారు. ఈ కాగితాలపై సందీప్ రెడ్డి రాసుకొన్న అంశాలను పోలీసులు డీ కోడ్ చేస్తున్నారు.సందీప్ రెడ్డి చేవేళ్ల నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డికి సమీప బంధువుగా చెబుతున్నారు.

సందీప్ రెడ్డి నుండి రూ. 10 లక్షలతో పాటు మూడు ల్యాప్‌టాప్‌లను కూడ పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.