సైబర్ నేరస్థులు రోజు రోజుకీ పెరిగిపోతున్నారు. సైబర్ నేరస్థులు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. పేరున్న వారి పేర్ల మీద నకిలీ సోషల్ మీడియా ఎకౌంట్లు తెరచి.. దాని ద్వారా ఇతరులను మోసం చేస్తున్నారు. ఆ నేరం తమ మీదకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. తాజాగా.. ఓ ఎమ్మెల్యే పేరిట ఫేస్ బుక్ ఖాతా తెరచారు. ఈ సంఘటన వికారాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేరిట నకిలీ ఫేస్ బుక్ ఖాతాను కొందరు దుండగులు సృష్టించారు. అక్కడితో ఆగకుండా.. ఆయన చేసినట్లుగా పలువురికి మెసేజ్ లు పంపడం గమనార్హం. తనకు అర్జెంట్ గా డబ్బులు కావాలంటూ ఎమ్మెల్యే అడిగినట్లుగా.. చాలా మందికి మెసేజ్ లు పెట్టారు.

ఆ మెసేజ్ లపై అనుమానం కలగడంతో.. కొందరు వెంటనే ఎమ్మెల్యేకు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో..  నకిలీ ఫేస్ బుక్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన వెంటనే పోలీసులను ఆశ్రయించారు.

తాను ఎవరికీ ఫేస్ బుక్ లో డబ్బుల కోసం మెసేజ్ లు చేయలేదని.. ఎవరూ డబ్బులు పంపి మోసపోవద్దంటూ ఆయన పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.