హైదరాబాద్: గిఫ్ట్ కార్డుల పేరుతో ప్రజలను మోసగిస్తున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా వివరాలను సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియాకు వివరించారు.

సోమవారం నాడు తన కార్యాలయంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ మీడియా సమావేశంలో గిఫ్ట్ కార్డు పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా వివరాలను సజ్జనార్ మీడియాకు వివరించారు.బీహార్ కు చెందిన ఐదుగురితో పాటు మంచిర్యాలకు చెందిన ఐదుగురిని కూడ అరెస్ట్ చేసినట్టుగా ఆయన తెలిపారు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు పరారీలో ఉన్నారని సీపీ చెప్పారు.

అరెస్టైన వారి నుండి 42 మొబైల్స్, 2 ల్యాప్ టాప్ లు 900 స్క్రాచ్ కార్డులు, 28 డెబిట్ కార్డులు, 10 ఆధార్ కార్డులు, రబ్బర్ స్టాంపులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఆయన తెలిపారు. నిందితులు ఇప్పటివరకు రూ. 2 కోట్లను ప్రజల నుండి వసూలు చేశారన్నారు.

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో కార్తీక్ అనే వ్యక్తికి ఫోన్ చేసి గిఫ్ట్ వచ్చిందని సమాచారం తీసుకొన్నారు. పోస్ట్ కార్డులో స్క్రాచ్ కార్డు వచ్చిందన్నారు. టాటా సఫారీ గెలుచుకొన్నారని అతడిని నమ్మించాడు. కరోనా కారణంగా డెలీవరీ చేయలేకపోతున్నామని అతడిని బురిడీ కొట్టించారు.

ఈ కారును దక్కించుకోవాలంటే  సుమారు రూ. 45 వేలను చెల్లించాలని కార్తీక్ కు చెప్పారు. నిందితులు చెప్పిన బ్యాంక్ ఖాతాలో కార్తీక్ డబ్బులు జమ చేశాడు. ఇలా విడతల వారీగా కార్తీక్ నుండి సుమారు 95 వేలకు పైగా వసూలు చేశారు. అయినా కూడ కారు డెలీవరీ చేయలేదు. దీంతో అనుమానం వచ్చిన కార్తీక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు.

ఈ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగు చూశాయని ఆయన చెప్పారు. గిఫ్ట్ కార్డుల ముఠాలో కుమార్ ప్రధాన నిందితుడని ఆయన చెప్పారు. పలు ఈ కామర్స్ సైట్స్ తో పాటు షాప్ క్లూస్, క్లబ్ ఫ్యాక్టరీ, నాఫ్టాల్ నుండి ఫోన్ నెంబర్లు సేకరించారు. కుమార్ కు అలోక్, తీరాంజు మరో ఇద్దరు సహాయం చేశారని గుర్తించామన్నారు.

తరుణ్ కుమార్ మోహిత్ తో కలిసి స్కార్చ్ కార్డులు తయారు చేస్తారని గిఫ్ట్ కార్డులను స్క్రాచ్ చేసి కార్డు పై ఉన్న నంబరుకి కాల్ చేయమని ఉంటుందని కస్టమర్ కాల్ చేసి మాట్లాడిన భాష ప్రకారం టెలీ కాలర్స్ లాగా మాట్లాడతారని సీపీ తెలిపారు.  ఇప్పటి వరకూ సైబరాబాద్ లో 3కేసులు నమోదయ్యాయని ఆయన అన్నారు. కాల్ చేసిన వారి నుంచి గిఫ్ట్ డెలివరీ కోసం వివిధ చార్జీల పేరిట డబ్బులు వసూలు చేస్తున్నారని గిఫ్ట్ పంపకుండా మోసాలకు పాల్పడుతున్నారన్నారు.