జలసాలకు అలవాటుపడి.. చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి... తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలించేవాడు.  రాత్రి వేళ్లల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి.. దొంగతనాలకు పాల్పడేవాడు. చివరకు పోలీసులకు చిక్కి... జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.  


జలసాలకు అలవాటుపడి.. చదువు మధ్యలోనే ఆపేశాడు. ఆటో డ్రైవర్ అవతారం ఎత్తి... తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలించేవాడు. రాత్రి వేళ్లల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి.. దొంగతనాలకు పాల్పడేవాడు. చివరకు పోలీసులకు చిక్కి... జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన నేనావత్‌ వినోద్‌ కుమార్‌ ఇబ్రహీంపట్నం ఏవీఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అతను అనంతరం కారు డ్రైవర్‌గా మారాడు. ఈ సమయంలోనే 2014 నుంచి 2018 వరకు ఈజీమనీ కోసం 28 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. 

చోరీకి అరగంట ముందు తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి ఒంటరిగానే పని పూర్తి చేసుకొని వెళ్లేవాడు. 2015లో నగర పోలీసులకు చిక్కిన వినోద్‌కుమార్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్న అతను 2017లో రాచకొండ పోలీసులకు చిక్కడంతో మరో సారి పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 

2018 ఆగస్టులో జైలు నుంచి బయటికి వచ్చిన అతను చోరీలకు పాల్పడుతూ అదే ఏడాది సెప్టెంబర్‌లోనే మీర్‌పేట పోలీసులకు చిక్కాడు. 2019 జవనరిలో జైలు నుంచి బయటికి వచ్చిన వినోద్‌కుమార్‌ కేవలం నాలుగు నెలల వ్యవధిలో హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 14 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును శంషీర్‌గంజ్‌కు చెందిన మదన్‌ కుమార్, గుజరాత్‌ వడోదరలోని నేహ జ్యూవెల్లరీ యజమానికి విక్రయించేవాడు. 

తాజాగా మరోసారి వినోద్ ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 53.4 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, నాలుగు ల్యాప్‌టాప్‌లు, బైక్, టీవీ, ట్యాబ్‌తో పాటు రూ.41,000 నగదును స్వాధీనం చేసుకున్నారు.