ఆమెకు అప్పటికే పెళ్లయ్యింది. భర్త కొడుకు కూడా ఉన్నారు. కానీ.. తాను ఇంకా పెళ్లి కాని అమ్మాయిలాగా అందరినీ నమ్మిస్తుంది. ఎన్ఆర్ఐ లను టార్గెట్ చేసి.. తన మాయ మాటలతో బుట్టలో వేసుకుంటుంది. ఇలా చాలా మందిని చీట్ చేయగా.. తాజాగా ఓ ఎన్ఆర్ఐని బురిడి కొట్టించిన తర్వాత పోలీసులకు దొరికిపోయింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళ ఇటీవల ఓ ఎన్ఆర్ఐకి గాలం వేసింది. తన తల్లికి లక్షల్లో ఆస్తులున్నాయని, ఆమె వేధింపుల కారణంగా బయటకు వచ్చి స్వతంత్రంగా బతుకుతున్నానని, తాను పెళ్లి చేసుకుంటే ఆ ఆస్తులన్నీ తన పేరుమీదకు మారతాయని నమ్మబలికింది. 

పూర్తిగా ఆమె మాటలకు పడిపోయిన అతడు, ఖర్చుల నిమిత్తం రూ.65లక్షలు అడగ్గా వెంటనే పంపాడు. తర్వాత ఆమెకు ఫోన్‌ చేయగా స్విచాఫ్‌ రావడంతో మోసపోయానని తెలుసుకొని పోలీసులను ఆశ్రయించాడు. మోసపోయిన ఆ ఎన్‌ఆర్‌ఐ.. కాలిఫోర్నియాలో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వరుణ్‌.

 మోసం చేసిన వివాహిత దేవటి మాళవిక అలియాస్‌ కీర్తి మాధవనేని. ఆమెకు భర్త శ్రీనివాస్‌, కుమారుడు వెంకటేశ్వర్‌ ప్రణవ్‌ సహకరించారు. మాళవిక కుటుంబం స్వస్థలం రంగారెడ్డి జిల్లా మోకిల్లా. విలాసవంతమైన జీవితం కోసం వీరు మోసాలబాట పట్టారు. మాళవిక.. ఓ మ్యాట్రిమోనీ సైట్‌లో నకిలీ ఖాతా తెరిచి తన పేరును కీర్తిగా నమోదు చేసుకుంది.

 ఆ సైట్‌ ద్వారా తనకు పరిచయమైన వరుణ్‌ను నమ్మించి మోసం చేసింది. వరుణ్‌ నుంచి ఫిర్యాదు స్వీకరించిన జూబ్లీహిల్స్‌ పోలీసులు.. మాళవికను, ఆమె కుమారుడు ప్రణవ్‌లను అరెస్టు చేశారు. ఆమె భర్త శ్రీనివాస్‌ పరారీలో ఉన్నాడు. 

మాళవిక, శ్రీనివాస్‌లపై గతంలో నల్లకుంట, బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి పోలీసుస్టేషన్‌ల పరిధుల్లో మోసాలు చేసినందుకు కేసులు నమోదయ్యాయి 2014లో మాళవిక, శ్రీనివాస్‌ దంపతులు ఓ ఎన్‌ఆర్‌ఐను మోసం చేసి పోలీసులకు పట్టుబడ్డారు. వీరితో పాటు శ్రీనివాస్‌ తల్లి  కూడా ఈ కేసులో నిందితురాలిగా ఉంది.