రెండు కుటుంబాల మధ్య పాతకక్షలు ఉన్నాయి. ఆ పాత కక్షల కారణంగా గొడవలు, చంపుకోవడాలు ఎందుకులేండి అని సర్దిచెప్పబోయాడు ఓ యువకుడు. మంచి చెబుదామని వెళితే .. చెడు ఎదురైనట్లు... తనకు సంబంధం లేకుండా.. ఆ పాతకక్షలకు బలయ్యాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం మేడిగడ్డ గేటు సమీపంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. మేడిగడ్డ తండాకు చెందిన బాల కిషన్ సింగ్, నిరంజన్ సింగ్ కుటుంబాల మధ్య 20ఏళ్లుగా భూ తగాదాలు ఉన్నాయి. నిరంజన్ సింగ్, రాజేష్ సింగ్ అన్నదమ్ములు. 2004లో జరిగిన ఘర్షణలో వీరి తల్లిదండ్రులు భారతీభాయి, బాలాజీ సింగ్ లు హత్యకు గురయ్యారు.

అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య తరచూ తగాదాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. బాలకిషన్ కుటుంబం వల్ల తమకు ప్రాణ భయం ఉందని.. ఇటీవల నిరంజన్ షింగ్, రాజేష్ సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ భయంతోనే సోదరులిద్దరూ తమ మిత్రులు, అనుచరులను రక్షణ గా ఉంచుకొని వ్యవసాయ పనులు చేయించుకుంటున్నారు.

ఈ విషయం తెలుసుకున్న బాలా సింగ్.. మరో ఐదుగురితో లారీల్లో వచ్చి.. ఆ పంట పొలాలను ధ్వంసం చేశాడు. అయితే.. గొడవ పడితే లాభం ఏముంటుంది.. నష్టం తప్ప.. అని రాజేష్ సింగ్ స్నేహితుడు ఏకుల సందీప్(26) సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. అంతే.. అడ్డు వచ్చాడని.. అతనిపై పగ పెంచుకున్నారు.

అతనిపై దాడి చేయడం మొదలుపెట్టారు. సందీప్ పారిపోయేందుకు ప్రయత్నించగా.. లారీలతో వెంటాడి..వేటాడి మరీ అతి కిరాతకంగా హత్య చేశారు. లారీలో తొక్కించడంతో సందీప్ తీవ్రగాయాలతో రోడ్డుపై పడిపోయాడు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. నిందితులు అక్కడి నుంచి పారిపోతుండగా.. పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం.