రంజాన్ మాసం కోసం ముస్లిం సోదరులు ఎంతగా ఎదురు చూస్తారో.. హైదరాబాద్ లో ఇతర మతస్థులు కూడా అంతగానే ఎదురు చూస్తారు. ఎందుకో తెలుసా..? కేవలం రంజాన్ మాసంలోనే లభించే హలీం కోసం. ఈ మాసంలో ఎక్కడ చూసినా హలీం సెంటర్లు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి.

ఎన్ని హలీం సెంటర్లు ఉన్నా.. దాని కోసం ప్రజలు కుప్పలు తెప్పలుగా క్యూలు కట్టికనపడతారు. దాని రుచి కేవలం రంజాన్ లో మాత్రమే దొరుకుతుంది. తిందామని అనుకున్నా.. మరే ఇతర రోజుల్లో ఈ  హలీం దొరకదు. అందుకే దానికి అంత డిమాండ్.

అయితే.. ప్రస్తుతం కరోనా రోజులు నడుస్తున్నాయి. దేశమంతా లాక్ డౌన్ లో ఉంది. గుంపులు గుంపులా ఉండటానికీ వీలు లేదు. కరోనాని అరికట్టాలంటే సామాజిక దూరం పాటించక తప్పదు. తెలంగాణలో అయితే.. లాక్ డౌన్ మే 7వ తేదీ వరకు కొనసాగుతోంది. ఆ తర్వాత మే నెల మొత్తం కొనసాగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఈ క్రమంలో ఈ రంజాన్ మాసంలో హలీం ప్రియులకు ఆ ఫుడ్ దొరికే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే దీనిపై హలీం ప్రియులు బెంగ పెట్టేసుకున్నారు. ఈ క్రమంలో హలీం తయారీలో ప్రముఖులైన పిస్తా హౌస్, షాగౌస్ లు తాజాగా ఓ ప్రకటన చేశాయి.

కాగా కరోనా కారణంగా ముస్లిం సోదరులు ప్రార్థనలను సైతం ఎవరింట్లో వారు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి హలీం ఉంటుందా? లేదా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నేడు పిస్తా హౌస్, షాగౌస్ ప్రకటన విడుదల చేశాయి. ఈ రంజాన్‌కు హలీం తయారు చేయడం లేదని పిస్తా హౌస్‌, షాగౌస్‌ ప్రకటించాయి.