హైదరాబాద్: దేశంలో పెట్రోల్ ధరలు ఎక్కువగా మెట్రో నగరంగా హైద్రాబాద్ రికార్డు సృష్టించింది. దేశంలోని ముంబై తర్వాత హైద్రాబాద్‌లోనే పెట్రోల్‌కు ఎక్కువ ధర ఉంది.

ఈ నెల 5వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టారు. పెట్రోల్, డీజీల్‌లపై ఎక్సైజ్ సుంకాన్ని ఒక్క శాతం పెంచనున్నట్టు ప్రకటించారు. ఒక్క శాతం ఎక్సైజ్ సుంకం పెంచడంతో  లీటర్‌ పెట్రోల్‌కు రూ.2.50, డీజీల్ లీటర్ కు రూ. 2.30 పెరిగింది.

దీంతో ముంబైలో ధరలు పెరగక ముందు లీటర్ పెట్రోల్‌ ధర రూ. 76.15 ఉంటే ధరలు పెరిగిన తర్వాత రూ. 78.57లకు చేరింది. హైద్రాబాద్‌లో ధరలు పెరగక ముందు లీటర్ పెట్రోల్‌కు రూ. 74.88, ధరలు పెరిగిన తర్వాత రూ.77.48లకు చేరింది.చెన్నైలో పాత ధర రూ. 73.20, కొత్త ధర రూ.75.76కు చేరుకొంది. బెంగుళూరులో పాత ధర రూ. 72.83, కొత్త ధర రూ.75.37కు చేరింది. న్యూఢిల్లీలో పాత ధర రూ. 70.51, కొత్త ధర 72.96లకు చేరింది.

గత ఏడాది నుండి పెట్రోల్ ధరల్లో హెచ్చ తగ్గులు కొనసాగుతున్నాయి.  గత ఏడాది అక్టోబర్ మాసంలో లీటర్ పెట్రోల్ ధర రూ.89లకు చేరింది.గత ఏడాది డిసెంబర్ మాసంలో ఈ ధర రూ.73లకు చేరుకొంది. కానీ, గత ఏడాది నుండి పెరుగుతూ వస్తూ రూ. 77.48లకు చేరింది.