తన భర్తపై మూకుమ్ముడిగా క్రూరంగా రాడ్లతో దాడి చేస్తుంటే చుట్టూ ఉన్న జనం వీడియోలు తీశారని, ఇవ్వరూ కనీసం ఆపేందుకు ప్రయత్నించలేదని పరువు హత్యకు గురైన నాగరాజు భార్య ఆశ్రిన్ సుల్తానా అన్నారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, దాడి జరినప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితులను ఆమె మీడియాకు వివరించారు.
హైదరాబాద్ లోని సరూర్ నగర్ లో బుధవారం పరువు హత్య సంచలనం సృష్టించింది. ఈ ఘటన విషయంలో మృతుడి నాగరాజు భార్య అశ్రిన్ సుల్తానా మీడియాతో మాట్లాడారు. తన భర్తను చంపేటప్పుడు జనాలు చూస్తూ ఉన్నారే తప్పా ఎవరూ ఆపడానికి రాలేదని అన్నారు. పైగా వారి మొబైల్ లో వీడియోలు తీశారని చెప్పారు. వారిని ఎంత ప్రాథేయపడినా స్పందించలేదని అన్నారు. తాను వారిని అడిగిన అమూల్యమైన సమయాన్ని వృథా చేశానని కన్నీటి పర్యంతమయ్యింది.
‘‘ అంతా పది పదిహేను నిమిషాల్లో జరిగిపోయింది. ఆ సమయంలో మా అన్న, స్నేహితులు కలిసి ఇనుప రాడ్ తో నాగరాజును ఇష్టమొచ్చినట్టు కొట్టారు. దాదాపు 30-35 సార్లు దాడి చేశారు. ఆయన మృతి చెందాడని కన్ఫమ్ అయిన తరువాతనే వారు పరారయ్యారు. దాడిని ఆపాలనే అన్నను, స్నేహితులను ఎంతగా వేడుకున్నా ఆపలేదు. చుట్టు ఉన్న జనాలను కూడా ప్రాథేయపడ్డాను. వారు కూడా కనికరించలేదు. కొందరైతే ఫోన్లలో వీడియోలు తీశారు. ’’ అంటూ ఆశ్రిన్ సుల్తానా ఆవేదన వ్యక్తం చేస్తూ మీడియాతో తెలిపారు.
నాగరాజుతో వివాహం జరిగాక మొదటి సారిగా ఆశ్రిన్ సుల్తానా వికరాబాద్ లో ఉన్న అత్తగారింటికి గురువారం వచ్చారు. అయితే అదే రోజు నాగరాజు అంత్యక్రియలు జరగడం విచారకరం. ఈ సమయంలోనే ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ బుధవారం రోజు నాగరాజు నన్ను బైక్ పై ఇంటికి తీసుకెళ్తున్నాడు. రోడ్డు దాటే క్రమంలో ఆయన బైక్ స్పీడ్ కొంచెం స్లో అయ్యింది. అదే సమయంలో పక్క నుంచి రెండు బైక్ లు స్పీడ్ గా మా ముందుకు వచ్చాయి. అయితే ఒక దాంట్లో మా అన్న ఉన్నాడు. నేను దానిని గుర్తించలేదు. క్షణాల్లోనే ఆ బైక్ పై ఉన్న వ్యక్తులు మా ఆయనను కిందకు తోసేశారు. దీంతో నాగరాజు కింద పడిపోయాడు. వెంటనే వారు తెచ్చుకున్న రాడ్లతో ఆయనను కొట్టడం మొదలు పెట్టారు. నేను ఆపబోయాను. కానీ మా అన్న స్నేహితులు నన్ను పక్కకు తోసేశారు.’’ అంటూ ఆమె కన్నీరుమున్నీరవుతూ చెప్పింది. నాగరాజును చంపిన అన్న, అతడి ఫ్రెండ్స్ ను చట్ట ప్రకారం శిక్షించాలని తెలిపారు.
నాగరాజును పెళ్లి చేసుకుంటానంటే తన కుటుంబం ఒప్పుకోలేదని ఆమె అన్నారు. తన అన్న చంపేస్తానని బెదిరించాడని చెప్పారు. వివాహానికి ముందు రోజు కూడా కూడా కొట్టాడని అన్నారు. గదిలో బంధించాడని, ఉరి వేసుకోవాలని సూచించాడని అశ్రీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఇంటి నుంచి అతి కష్టం మీద తప్పించుకొని వచ్చానని తెలిపారు. ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఉందని తెలిసి నాగరాజును వేరే పెళ్లి చేసుకోవాలని గతంలో రెండు నెలల పాటు ప్రయత్నించానని అన్నారు. కానీ ఆయన వినలేదని తెలిపారు. పెళ్లి తరువాత తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించామని అన్నారు. అయితే వారు కుటుంబానికి దూరంగా ఉండాలని సూచించారని చెప్పారు. తాను నాగరాజు ఇంట్లోనే ఉంటానని అన్నారు. అతడి జ్ఞాపకాలతో జీవితాంతం బతుకుతానని తెలిపారు. తనకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
