వాషింగ్టన్ డీసీ: తెలంగాణపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరుగుతన్న తానా సదస్సులో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను పదో తరగతి చదువుతున్నప్పుడు తన మిత్రుడు హైదరాబాదు వెళ్లాడని, అతన్ని తెలంగాణవాళ్లు తిట్టిపోసి వెనక్కి పంపించారని ఆయన అన్నారు. 

తెలంగాణ విడిపోయినప్పుడు ఎటు వెళ్లాలో తనకు తెలియలేదని పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ అంటే తనకు చాలా ఇష్టమని దక్కన్ పీఠభూమి అంటే గుండె కోసుకుంటానని ఆయన చెప్పారు. తన మిత్రుడిని వెనక్కి పంపించినప్పటి నుంచే తాను తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు ఆయన తెలిపారు. 

ఒకే జాతి ఉండే, ఒకే భాష మాట్లాడేవారు రాష్ట్ర విభజనతో విడిపోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అందుకు రాజకీయ వ్యవస్థ కారణమని, రాజకీయ వ్యవస్థ చేసిన తప్పునకు బాధపడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చారని అన్నారు. తాను కూడా మాట్లాకపోతే ఎలా, మాట్లాడకుండా బతికేయవచ్చునని, కానీ తాను బయటకు వచ్చానని ఆయన చెప్పారు. 

బయటకు వచ్చిన తర్వాత చచ్చిపోవచ్చు, నలిగిపోవచ్చు, ఓడిపోవచ్చు కానీ తాను బయటకు వచ్చానని, మంచి సమాజం కోసం వచ్చానని ఆయన అన్నారు. తనకు డబ్బు అవసరం లేదని, తాను చూడని జీవితం లేదని, తనకు డబ్బుకు ఇబ్బంది లేదని, విచ్ఛిన్నమవుతున్న సమాజంలో తన బిడ్డలు బతకడం తనకు ఇష్టం లేదని ఆయన అన్నారు. ఏదో తీసుకుందామని తాను గానీ మనోహర్ గానీ రాలేదని ఆయన అన్నారు. 

విలువలతో రాజకీయాలు చేసి ఓటమి పాలయ్యామని, ఓటమి బలాన్నిచ్చిందని ఆయన అన్నారు. ఎపిలో గానీ తెలంగాణలో గానీ, భారతదేశంలో గానీ తాము బలంగా నిలబడుతామని ఆయన చెప్పారు. తమకు సమస్యలు ఉన్నాయని, తమతో చేతులు కలపడానికి మీరంతా ఉమ్మడిగా రావాలని ఆన అయన అన్నారు. 

నియంతలాగా పాలకులు ఉంటే ఎలా అని ఆయన అడిగారు. నాయకుడి చూసి ప్రేమించే దేశం మనదని, భయపడే దేశం కాదని ఆయన చెప్పారు. నాయకుడిని చూసి ప్రజలు భయపడుతున్నారంటే, అటువంటి నాయకుడికి ఏదో రోజు పతనం తప్పదని ఆయన అన్నారు. అది తెలంగాణ కావచ్చు, ఎపి కావచ్చు, భారతదేశమూ కావచ్చునని ఆయన అన్నారు. భయపెట్టి పాలిస్తామంటే కుదరదని ఆయన అన్నారు. దేశం కోసం తాము దెబ్బ తిని కూడా నిలబడి ఉన్నామని ఆయన చెప్పారు.