హన్మకొండలో దారుణం జరిగింది. బిల్లు చెల్లిస్తేనే ఆస్పత్రిలో చేర్పించుకుంటామంటూ మొండికేసిన సిబ్బంది కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది.

వివరాల్లోకెళితే.. కొమురమ్మ అనే మహిళ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు.

అయితే పేషెంట్‌ను ఆస్పత్రిలో చేర్చుకోవాలంటే ముందుగానే బిల్లు చెల్లించాలంటూ ఆస్పత్రి వర్గాలు డిమాండ్ చేశాయి. అన్నట్లుగానే డబ్బులు చెల్లించే వరకు దాదాపు గంట పాటు అంబులెన్స్‌లోనే పేషెంట్‌ను వదిలి వెళ్లారు ఆస్పత్రి సిబ్బంది.

అయితే అప్పటికే చికిత్స ఆలస్యమవడంతో కొమురమ్మ చనిపోయింది. దాంతో ఆగ్రహానికి గురైన మృతురాలి బంధువులు.. ఆస్పత్రిపై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.

దాంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని మృతురాలి బంధువులకు సర్దిచెప్పారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.