బోనాలలో పోతరాజుగా ఫేమస్ అయిన, అల్వాల్‌ ప్రాంతానికి చెందిన పహిల్వాన్‌ నారాయణ ఆదివారం అనారోగ్యంతోమరణించారు. బోనాల ఉత్సవాలలో పోతరాజుగా కొన్ని దశాబ్దాలుగా అలరిస్తున్న నారాయణ (75) కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఆదివారం తుది శ్వాస విడిచారు. 

1962 నుంచి పోతరాజు వేషధారణలో ఓల్డ్‌ అల్వాల్‌లోని పోచమ్మ విశిష్టతను భక్తులకు వివరించేవారు. పోతురాజుగానే కాకుండా నారాయణ నగరంలో కుస్తీ పోటీలలో కూడా పాల్గొనేవారు. అలా పహిల్వాన్‌ నారాయణగా కూడా పేరు సంపాదించారు. 

కుస్తీ పోటీలలో రాణించడంతో హెచ్‌ఎంటీ కంపెనీలో ఉద్యోగం పొందారు. అమ్మవారికి వీరభక్తుడు కావడంతో 2015 వరకు ఏటా బోనాల ఉత్సవాలలో పోతరాజు వేషధారణ ధరించి మొక్కులు చెల్లించుకునేవాడు. దేశంలో నిర్వహించిన ఆసియా క్రీడల సందర్భంగా కూడా పోతరాజు విన్యాసాలతో అలరించారు. 

1982లో ప్రధాని ఇందిరాగాందీ, ఆ తర్వాత రాజీవ్‌గాంధీ నుంచి ప్రశంసాపత్రాలను అందుకున్నారు. 1994లో రాష్ట్రపతులు జైల్‌సింగ్‌, శంకర్‌ దయాల్‌ శర్మ అభినందనలు పొందారు. నారాయణకు భార్య, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన అంత్యక్రియలను అల్వాల్‌ స్మశాన వాటికలో నిర్వహించారు.