పోలీసుల అత్యుత్సాహం: బాలింత ప్రయాణిస్తున్న అమ్మఒడి వాహనం సీజ్!
హైదరాబాద్ లో నేడు కొందరు అత్యుత్సాహవంతులైన పోలీసులు నిన్న డెలివరీ అయిన బాలింత ప్రయాణిస్తున్న అంబులెన్సును సీజ్ చేసారు.
లాక్ డౌన్ వేళ కొందరు నియమాలను ఉల్లంఘిస్తున్నందున మరింత కట్టుదిట్టంగా లాక్ డౌన్ ను అమలు చేస్తామని నిన్న డీజీపీ చెప్పిన విషయం తెలిసిందే. ఇలా డీజీపీ గారు ప్రకటించిన తెల్లారే హైదరాబాద్ లో నేడు కొందరు అత్యుత్సాహవంతులైన పోలీసులు నిన్న డెలివరీ అయిన బాలింత ప్రయాణిస్తున్న అంబులెన్సును సీజ్ చేసారు.
నిన్ననే పుట్టిన పసి బిడ్డతో ఆ తల్లి తన సొంత ఊరుకు పయనమైంది ఒక బాలింత. ఏదో ప్రైవేట్ అంబులెన్సును ఆపినా అనుమానం వచ్చి ఆపారు అనుకోవచ్చు. పోలీసులు ఆపింది స్వయానా ప్రభుత్వ అంబులెన్సును. అందునా గర్భిణీలు, బాలింతల కోసం ప్రత్యేకంగా సేవలందించే 102 అంబులెన్సును.
ఆ సదరు తల్లి నిన్న శిశువుకు జన్మనిచ్చింది. నిన్నటి నుండి ఇంటికి చేరుకోవడానికి బండ్లు దొరక్క తీవ్ర అవస్థలు పడుతుంది. అలాంటి ఆ బాలింతను ఆపడం మాత్రం అక్కడ డ్యూటీలో ఉన్న పోలీసు అధికారి ఇన్ సెన్సిటివిటీ అని చెప్పక తప్పదు.
అక్కడ డ్యూటీలో ఉన్న ఏసీపీ నాగన్నను అక్కడ కవరేజ్ చేస్తున్న జర్నలిస్టులు ఆ వాహనాన్ని వదిలివేయమని కోరినా ఆయన మాత్రం వినిపించుకోలేదు. చివరకు అడిషనల్ డీసీపీ రంగంలోకి దిగి ఆ బండిని పంపించారు. పాతబస్తీలోని మదీనా ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఇప్పటికే సోషల్ మీడియాలో తీవ్రమైన చర్చ నడుస్తుంది.
అమ్మఒడి వాహనాలు అని గర్వంగా ప్రభుత్వం నడిపిస్తున్న ఈ సర్వీసును పోలీసులు ఇలా అర్థం పర్థం లేకుండా ఆపడం ఏమిటని ప్రజలు పోలీసులపై ఫైర్ అవుతున్నారు.
పోలీసులు లా అండ్ ఆర్డర్ ను కాపాడాలి కానీ, వారు ఒకింత సెన్సిటివ్ గా కూడా ఉండాలి. ఇలాంటి అత్యుత్సాహవంతులైన పోలీసుల వల్ల పూర్తి పోలీస్ డిపార్ట్మెంట్ కె మచ్చ వస్తుంది. ఇన్ని రోజులుగా తెలంగాణాలో పోలీసులు రేయనకా, పగలనకా కష్టించి పనిచేస్తున్నారు. అంత కష్టపడి సంపాదించుకున్న మంచి ఇమేజ్ ను ఇలాంటి ఒక్క సంఘటన వల్ల పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉంది.