మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఎఎస్  అధికారులు పర్యటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ దత్తత గ్రామమైన ఇబ్రహీంపూర్ గ్రామంలో జరుగుతున్న అభివృద్ది, పర్యావరణ హితమైన పనులను చూసిన ప్రజాప్రతినిధులు, అధికారుల బృదం ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యే నిబద్దతలో పనిచేస్తే ఎలాంటి మార్పులుంటాయో హరీష్ ను, ఆయన నియోజకవర్గాన్ని చూస్తే అర్థమవుతోందని ఈ బృందం అభిప్రాయపడింది.

ఇలా ఓ గ్రామ రూపురేఖలను మార్చిన ఎమ్మెల్యే హరీష్ ను వారు కొనియాడారు. ఈ గ్రామాన్ని చూసి ఫిదా అయ్యామని ఎమ్మెల్యే లు తెలిపారు. తాము కూడా హరీష్ ను ఆదర్శంగా తీసుకుంటామని ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఈ గ్రామాభివృద్ది గురించి, రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి  హరీష్ చక్కగా వివరించారని తెలిపారు.

ఇబ్రహీంపూర్ గ్రామస్తులు ప్రభుత్వ పథకాలను చాలా బాగా సద్వినియోగం చేసుకున్నారని హర్యానా స్పీకర్ కుంవర్ పేర్కొన్నారు. ముఖ్యంగా వాటర్ మేనేజ్ మెంట్ విషయంలో గ్రామస్తులు కనబరిచిన ఐక్యత స్ఫూర్తి దాయకంగా ఉందన్నారు. గ్రామాల అబివృద్ది తోనే దేశ వికాసం సాధ్యమవుతుందని అన్నారు. ఇబ్రాహీంపూర్ కు రావడం సంతోషంగా ఉందని...అభివృద్ధి, ఐక్యతకు ఈ గ్రామం స్ఫూర్తిగా నిలుస్తోందని కుంవర్ అభిప్రాయపడ్డారు. 

ఇబ్రహీంపూర్ గ్రామాన్ని చూడటం కాదు గ్రామస్తుల ముఖాల్లోనే  గ్రామ అభివృద్ధి కనపడుతోందన్నారు. తామంతా కలిసి దాదాపు మూడు గంటల పాటు గ్రామ అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యేల బృందం తెలిపారు. అభివృద్ధి ప్రణాళికలు, పనితీరు, ప్రజల ఐక్యతను దగ్గరుండి చూపిస్తూ, వివరించిన  ఎమ్మెల్యే హరీష్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. 

ఇలా అభివృద్ది పథంలో పయనిస్తున్న గ్రామానికి రావడం తమకు సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి అంటేనే ఇబ్రహీంపూర్... అభివృద్ధి అంటే ఇక్కడి ప్రజలే అన్నట్లుగా ఉందన్నారు. ఈ బృందంలోని 61 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులకు హరీష్ రావు గారు సిద్ధిపేట గొల్ల భామ చీరలు,కాపు రాజయ్య పెయింటింగ్స్ జ్ఞాపికలు బహూకరించి సన్మానించారు.