Asianet News TeluguAsianet News Telugu

ఏకమవుతున్న విపక్షాలు: సెక్రటేరియేట్‌ కూల్చివేతపై రౌండ్ టేబుల్ సమావేశం

కొత్త అసెంబ్లీ, సెక్రటేరియేట్‌లు నిర్మించాలన్న అనే అంశంపై ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో హైదరాబాద్ పార్క్‌హయత్‌లో జరిగిన రౌండ్ టేబుల్ జరిగింది.

opposition parties round table meet on telangana secretariat demolition
Author
Hyderabad, First Published Jul 7, 2019, 4:30 PM IST

తెలంగాణా రాష్ట్రానికి కొత్త అసెంబ్లీ, కొత్త సెక్రటేరియేట్ అవసరం లేదన్నారు టీపీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.

కొత్త అసెంబ్లీ, సెక్రటేరియేట్‌లు నిర్మించాలన్న అనే అంశంపై ప్రజాస్వామిక తెలంగాణ పేరుతో హైదరాబాద్ పార్క్‌హయత్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తాను అసెంబ్లీలో ఐదుసార్లు ఎమ్మెల్యేగా అడుగుపెట్టానని గుర్తుచేశారు.

ఇప్పుడున్న సేక్రటేరియేట్, అసెంబ్లీ భవనాలు కొన్ని దశాబ్ధాల పాటు కొనసాగే సామర్ధ్యం ఉందని ఉత్తమ్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు అసెంబ్లీ కోసం మెట్రోనే వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు.

వారసత్వ కట్టడాలను కాపాడుకోవాలని.. కొత్త సెక్రటేరియేట్, కొత్త అసెంబ్లీ భవన నిర్మాణాలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తోందన్నారు. దీని వల్ల అమూల్యమైన ప్రజాధనం వృథా అవుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిక్షాలు, ప్రజల అభిప్రాయం తీసుకోవాలని, ప్రజలతో కలిసి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. బీజేపీ నేత ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ... సెక్రటేరియేట్ కూల్చివేత నిర్ణయాన్ని ప్రజలతో పాటు టీఆర్ఎస్ నేతలు సైతం ఖండించాలని తెలిపారు.

ఉస్మానియా యూనివర్సిటీలోని పలు భవనాలను చూస్తే.. అక్కడ గొడ్లు కూడా ఉండవని అటువంటి భవనాలను కేసీఆర్ తిరిగి కట్టించాలని రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఏదో ఆర్ధికపరమైన లబ్ధి ఉంది కాబట్టే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ... ఎర్రమంజిల్‌లో కొత్త అసెంబ్లీ ఎందుకు కట్టాలో కారణం ఎవరు చెప్పడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రస్తుత అసెంబ్లీ భవనంలో అందరికీ సరిపోయేంత ఖాళీ ఉందన్నారు.

ఉద్యమ ఆకాంక్షను, తెలంగాణ ప్రాధాన్యాలను కేసీఆర్ ఎప్పుడో పక్కనపెట్టారని రావుల మండిపడ్డారు. కల్వకుంట్ల కుటుంబం అధికారంలో ఉండాలంటే.. సెక్రటేరియేట్ కూల్చాలని ఎవరో చెప్పిన మాటలను కేసీఆర్ నమ్మడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ ఎంపీ వివేక్.

ఉమ్మడి రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలకు, కౌన్సిల్‌కు పనికొచ్చిన అసెంబ్లీ భవనం.. ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా పోయిందని ఆయన ప్రశ్నించారు. అనాలోచిత నిర్ణయాలతో కేసీఆర్.. మహ్మద్ బిన్ తుగ్లక్‌లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. 

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేతలు పలు తీర్మానాలు చేశారు.

1. సెక్రటేరియేట్ భవనాలను, ఎర్రమంజిల్‌ భవనాలు కూల్చరాదు.

2. సెక్రటేరియేట్, అసెంబ్లీలను ఇప్పుడున్న భవనాలలోనే కొనసాగించాలని, కూల్చివేతలు, కొత్త భవనాల నిర్మాణాలకు నిధులను దుర్వినియోగం చేయరాదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

3. చారిత్రక వారసత్వ కట్టడాల విధ్వంపాన్ని అడ్డుకోవాలి. వందల ఏళ్ల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఉనికిని కాపాడాలి.

4. పై డిమాండ్ల సాధనకు గవర్నర్ ను కలిసి మెమోరాండం ఇవ్వాలని, జిల్లాల్లో ఆల్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశాలను జరపాలని సభ నిర్ణయించింది. అందుకు ప్రజాస్వామిక తెలంగాణ చొరవ తీసుకోవాలని సభ కోరుతున్నది. ప్రత్యక్ష కార్యాచరణకు వెనుకాడమని అఖిల పక్షం ప్రకటిస్తున్నది.

5. అత్యున్నత న్యాయ స్థానం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. 

6. కొత్త నిర్మాణాలు, భవనాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఖర్చులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. ప్రజలకు జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలి.
 

Follow Us:
Download App:
  • android
  • ios