కరోనా వైరస్ మహమ్మారి అంతకంతకు విస్తరిస్తూ అటు ప్రపంచాన్ని, ఇటు భారతదేశాన్ని కూడా హడలెత్తిస్తోంది. ఢిల్లీలో పిజ్జా డెలివరీ ఏజెంట్ కి కరోనా సోకిన విషయం మరువక ముందే హైదరాబాద్ లో కూడా ఓక ఫుడ్ డెలివరీ ఏజెంట్ కి కరోనా సోకింది. 

ఇతను ఒక సంవత్సరం నుంచి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థతో పనిచేస్తున్నట్టు తెలియవస్తుంది. ఆన్ లైన్ లో ఫుడ్ అందించే ఫుడ్ అగ్రిగేటర్ సంస్థ వద్ద డెలివరీ ఏజెంట్ గా పనిచేస్తున్న వ్యక్తి కరోనా పాజిటివ్ గా తేలాడు. గత రెండు వారాలుగా ఏ రెస్టారంట్ ల నుండి, ఏ డెలివరీ పాయింట్ల నుండి ఈ సదరు వ్యక్తి ఫుడ్ పార్సిళ్లను తీసుకున్నాడు, ఎవరెవరికి అందించాడు వంటి వివరాలను సేకరించే పనిలో పడ్డారు అధికారులు.  

అతడి తండ్రి నుంచి ఈ కుర్రాడికి సంక్రమించిందని అధికారులు ఒక నిర్ధారణకు వచ్చారు. ఈ సదరు కుర్రాడు మార్చ్ 18 నుంచి 20 వరకు స్విగ్గి డెలివరీలను చేసాడు. కానీ మార్చ్ 21 తరువాత, లాక్ డౌన్ మొదలు అయ్యాక ఒక్క డెలివరీ కూడా చేయలేదని స్విగ్గి యాజమాన్యం తెలిపింది.

నాంపల్లి ప్రాంతానికి చెందిన ఈ ఫుడ్ డెలివరీ ఏజెంట్ కుటుంబాన్ని ఇప్పటికే క్వారంటైన్ కి తరలించారు. సదరు డెలివరీ ఏజెంట్ తో పాటు అతడు కలిసిన మిగిలిన ఏజెంట్ల వివరాలను కూడా సేకరిస్తున్నారు అధికారులు. అతడి గత రెండు వారల పూర్తి హిస్టరీని తవ్వి తీసే పనిలో అధికార యంత్రాంగం తలమునకలై ఉంది. 

ఇలా ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ ఏజెంట్ కి కరోనా సోకడంతో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ ని వాడేవారు భయాందోళనలకు గురవుతున్నారు. ప్రభుత్వం ఇలా ఆన్ లైన్ డెలివరీకి పూర్తిస్థాయిలో అనుమతిస్తే ఆ డెలివరీ ఏజెంట్స్ కరోనా పాజిటివ్ గా తేలుతుండడంతో.... తాము ఇంట్లో ఉండి కూడా కరోనా బారిన పడే ప్రమాదం లేకపోలేదని వారు వాపోతున్నారు. 

ఇకపోతే తెలంగాణాలో కరోనా కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. హైదరాబాదులో కరోనా జడలు విప్పుతోంది. తెలంగాణలో కొత్తగా 43 కేసులు నమోదు కాగా, అందులో హైదరాబాదులో నమోదైన కేసులే 31 ఉన్నాయి. దాంతో తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 809కి చేరుకుంది.  ఇప్పటి వరకు తెలంగాణలో 18 మంది మరణించారు. 

తెలంగాణలో యాక్టివ్ కేసుల సంఖ్య 605 ఉంది. ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 186 మంది డిశ్చార్జీ అయ్యారు. దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాదులో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేయాలని ఆయన ఆదేశించారు. హైదరాబాదులో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని కేసీఆర్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరూ బయటకు రావద్దని ఆయన అన్నారు.