తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరగటం ఆందోళన రేకెత్తిస్తోంది. మొత్తం కేసులు తొమ్మిది వందలు దాటిపోయాయ్. ఇవాళ తెలంగాణలో కొత్తగా 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

ఈరోజు కరోనాతో ఒకరు మృతి చెందడంతో ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 24 మంది మృతి చెందారు. ఇక పాజిటివ్ కేసుల నుంచి 194 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 725 యాక్టీవ్  పాజిటివ్ కేసులు ఉన్నాయి.  

సూర్యాపేట జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. ఈ రోజు మరో 3 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు కలెక్టర్‌ వెల్లడించారు. దీంతో జిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 83కి చేరినట్టు చెబుతున్నారు. 

ఇదిలా ఉండగా... హైదరాబాద్ నగరంలో ఓ యాచకురాలికి కరోనా సోకినట్లు నిర్థారించారు. దీంతో ఆమె కాంటాక్ట్ లో దాదాపు 34మందిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. కాగా.. కొత్తగా కేసులు నమోదైన ప్రాంతాలపై అధికారులు నిఘా పెట్టారు.

విజయనగర కాలనీ సమీపంలో జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న తాత్కాలిక షెల్టర్ హోంలో నగరంలోని యాచకులకు ఆశ్రయం కల్పించారు. వారం రోజుల క్రితం అక్కడున్న మహిళ జ్వరంతో బాధపడుతుంటే కింగ్ కోఠి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ వచ్చింది. దీంతో.. ఆమెతో పాటు స్టేట్ హోంలో ఆశ్రయం పొందుతున్న 34మంది  యాచకులను క్వారంటైన్ కేంద్రానికి తరలించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

నగరంలో యాచకుల షెల్టర్ జోన్లు మొత్తం 24 ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా... అక్కడకు చాలా మంది స్వచ్ఛంద సంస్థల వారు వచ్చి మంచినీరు, ఆహారం పంపిణీ చేస్తుంటారని.. ఈ క్రమంలో కరోనా వారికి వ్యాపించకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.