Asianet News TeluguAsianet News Telugu

5న హుజురాబాద్‌లో ఆటో నగర్ కార్మికులకు భూమి పట్టాల పంపిణీ: మంత్రి గంగుల

వచ్చే నెల 5న హుజురాబాద్‌లోని ఆటోనగర్ కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన స్థల పట్టాలను మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్లు అందజేయనున్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. కేవలం ఆటో యూనియన్లకే కాకుండా ప్రతి కుల సంఘానికి స్థలాన్ని కేటాయించి సంఘ భవనాల్ని సైతం నిర్మించి ఇస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు.
 

on 5th of september ministers harish rao and gangula kamalakar to distribute land pattas to huzurabads auto nagar workers
Author
Huzurabad, First Published Aug 30, 2021, 2:20 PM IST

హుజురాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఫోకస్ అంతా ఉప ఎన్నిక జరగనున్న హుజురాబాద్‌పైనే ఉంచింది. మంత్రుల పర్యటన, అభివృద్ధి పనులు, కొత్త కార్యక్రమాల ప్రకటనకు హుజురాబాద్ కేరాఫ్‌గా నిలుస్తున్నది. తాజాగా, హుజురాబాద్‌లోని కేసీఆర్ ఆటోనగర్ కార్మికులకు భూమి పట్టాల పంపిణీ చేయనున్నట్టు బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగు కమలాకర్ వెల్లడించారు. మంత్రి హరీశ్ రావు, తానూ స్వయంగా ఈ భూపట్టాలను పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి జరుగుతున్న ఏర్పాట్లను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఆటో నగర్ అభివృద్ధి కోసం కేసీఆర్ ప్రభుత్వం ఏడెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించిందని, అలాగే, రూ. 40 కోట్లనూ మంజూరు చేసిందని మంత్రి గంగుల తెలిపారు. అందుకు కృతజ్ఞతగా ఆటో నగర్ కార్మికులు తమ కాలనీ పేరు ముందు కేసీఆర్‌ను చేర్చి కేసీఆర్ ఆటో నగర్‌గా మార్చుకున్నారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు. వచ్చే నెల 5వ తేదీన తనతోపాటు సహచర మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేసిన భూమి పట్టాలను అందుతాయని వివరించారు.

హుజురాబాద్‌లో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రానున్న రోజుల్లో హుజురాబాద్ సరికత్త కళ సంతరించుకుంటుందని తెలిపారు. ఎమ్మెల్యే లేని ప్రాంత అభివృద్ధికి పాటుపడటం మంత్రులుగా తమదే బాధ్యత అని చెప్పారు. గత 20 ఏళ్లుగా దొరకని స్థలం ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని ఈటలకు పరోక్షంగా ప్రశ్నలు వేస్తూ చురకలంటించారు. తాము కరీంనగర్ నుంచి తెచ్చి ఈ స్థలాన్ని ఇవ్వడం లేదని వ్యంగ్యంగా అన్నారు. ఆయనకు చిత్తశుద్ధి లేకనే స్థలాన్ని ఇవ్వలేదని తెలిపారు. ఇప్పుడు తమకు కార్మికుల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉన్నది కనుకనే స్థలాన్ని ఇవ్వగలిగామన్నారు.  

కేవలం మెకానిక్, ఆటో యూనియన్లకే కాకుండా ప్రతి కులసంఘానికి స్థలాన్ని కేటాయించి సంఘ భవనాల్ని సైతం నిర్మించి ఇస్తున్నామని మంత్రి వివరించారు. ఆటోనగర్ కావాలని మెకానిక్‌లు పలుసార్లు మొరపెట్టుకుంటే ఈటల ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కార్మికుల పట్ల ఆయనకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదని ఎద్దేవా చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios