రోడ్డు మీద పది రూపాయలు కనబడతానే ఎవరు చూడకుండా చటుక్కున జేబులో వేసేసుకుంటాం.  అలాంటిది బంగారు చైన్,  30 సవర్ల వెండి పట్టీలు, రెండు వేల రూపాయల నగదు కనిపించినప్పటికీ ఏమాత్రం కక్కుర్తిపడకుండా తీసుకెళ్లి పోలీసులకు అప్పగించాడో ఓలా క్యాబ్ డ్రైవర్.

వివరాల్లోకి వెళితే.. నయా క్విలాకు చెందిన ఆర్బాజ్ ఓలా క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో చిలకలగూడకు చెందిన కిరణ్మయి అనే మహిళ సోమవారం బొల్లారం వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేసుకుని ఎక్కింది.

గమ్యస్థానం చేరుకున్న తర్వాత కిరణ్మయి కారు దిగేసింది కానీ హ్యాండ్ బ్యాగ్ మరచిపోయింది. మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లిన ఆర్బాజ్‌కు కారులో హ్యాండ్  బ్యాగ్ కనిపించింది.

పరాయి సొమ్ముపై ఆశపడకుండా వెంటనే గొల్కొండ పోలీసులకు బ్యాగ్ అప్పగించాడు. బ్యాగ్ దొరికిన విషయాన్ని కిరణ్మయికి తెలియజేసిన పోలీసులు.. అనంతరం ఆమెకు హ్యాండ్ బ్యాగ్ అప్పగించారు.