నల్లగొండ: నల్లగొండ సాహితీ లోకం పెద్ద దిక్కును కోల్పోయింది.  బహుభాషావేత్త, ప్రముఖ రచయిత డాక్టర్‌ నోముల సత్యనారాయణ (80) కన్నుమూశారు. కొంతకాలంగా శ్వాసకోస వ్యాధితో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 

ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. నల్లగొండలోని రవీంద్రనగర్‌కు చెందిన సత్యనారాయణ స్థానిక ఎన్‌జీ కళాశాలలో ఇంగ్లిషు లెక్చరర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కథ, నవల, కవిత్వం, విమర్శ లాంటి సాహిత్య ప్రక్రియల్లో ఆయనకు విశేషమైన పరిచయం ఉంది. 

తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో విశేష పాండిత్యం నోముల సొంతం. ‘అన్‌ టోల్డ్‌ లెసన్‌’ అనే పుస్తకం కూడా రాశారు. నల్లగొండలో నడిచే గ్రంథాలయంగా ఆయనను అభివర్ణిస్తుంటారు.
 
ఆయన కుటుంబ సభ్యులు నోముల సాహితీ సమితిని స్థాపించారు. ఏటా నోముల పురస్కార కథల పోటీలు నిర్వహించి, ఉత్తమ కథలకు పురస్కారాలు అందజేస్తున్నారు. సాహిత్య రంగంలో సేవలకు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ పురస్కారం అందుకున్నారు. శ్రీశ్రీ, రావిశాస్త్రి వంటి సాహితీ దిగ్గజాలతో ఆయన సన్నిహిత సంబంధాలు ఉండేవి. 

ఆయన కుమారుడు రజనీశ్‌, అల్లుడు ఎలికట్టె శంకర్‌రావు కూడా రచయితలుగా ప్రసిద్ధులు. నోముల మృతి తెలుగు సాహితీ రంగానికి తీరని లోటని తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జయధీర్‌ తిరుమలరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజోజు నాగభూషణం ఒక ప్రకటనలో సంతాపం తెలిపారు.