నిజామాబాద్ జిల్లా బోధన్‌లో నేడు హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయతే ఈ బంద్‌కు అనుమతి లేదని నిజామాబాద్ పోలీసులు స్పష్టం చేశారు. బలవంతంగా బంద్ చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
నిజామాబాద్ జిల్లా బోధన్‌లో ఆదివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో శనివారం రాత్రికి రాత్రే ఓ వర్గం శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో వివాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే చోటుచేసుకున్న పరిణామాలు అక్కడ ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో నేడు బోధన్‌లో హిందూ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. అయితే ఇవాళ బంద్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. బలవంతంగా బంద్ చేయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ క్రమంలోనే బోధన్‌లో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. పికెటింగ్ ఏర్పాటు చేసి.. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు బోధన్‌లో ఆర్టీసీ బస్సుల యథాతథంగా తిరుగుతున్నాయి.
బోధన్‌లో పరిస్థితి అదుపులో ఉందని నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు తెలిపారు. నిన్నటి ఘటనలో 10 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్టుగా చెప్పారు. విగ్రహం ఏర్పాటుకు కలెక్టర్ అనుమతి పొందలేదని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా ఆందోళనకారులను గుర్తించామని వెల్లడించారు. 170 మందిని ముందస్తుగా అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇతర ప్రాంతాల నాయకులు బోధన్‌కు రావొద్దని సూచించారు.
ఇక, బోధన్ లో రాత్రికి రాత్రే శివసేన, బీజేపీ కార్యకర్తలు శివాజీ విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే మైనారిటీ నాయకులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోట బైఠాయించిన మైనారిటీ నాయకులు.. విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకి ఇరువర్గాల నాయకులు, స్థానికులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
అయితే పోలీసులు ఎంతగా నచ్చజెప్పిన ఇరువర్గాలు వినిపించుకోలేదు. పరిస్థితులు చేయిజారకుండా భారీగా పోలీసులు మోహరించారు. నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు.. విగ్రహ ఏర్పాటుతో ఉద్రిక్తతలకు తావివ్వొద్దని, ఏదైనా న్యాయపరంగా చూసుకోవాలని ఇరు వర్గాలకు సూచించారు. దీంతో ఓ వర్గం వారు అక్కడి నుంచి వెళ్లిపోయి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. మరోవైపు విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని, అప్పటివరకూ విగ్రహాన్ని తొలగించక తప్పదని నిజామాబాద్ సీపీ స్పష్టం చేశారు.
అక్కడి నుంచి వెళ్లి పోవాలని సూచించగా నాయకులు నిరాకరించారు. ఈ క్రమంలో ఆందోళనకారులు వేసుకున్న టెంట్‌ను పోలీసులు తొలగించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. సీపీ లాఠీచార్జికి ఆదేశించడంతో ప్రత్యేక బలగాలు లాఠీలు ఝళిపించాయి. బాష్పవాయువును ప్రయోగించారు. పోలీసుల దెబ్బలకు ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోగా అతడిని ఆస్పత్రికి తరలించారు.బోధన్ ఠాణా ఎదుట బైఠాయించిన వారిపైనా పోలీసులు లాఠీచార్జి చేసి చెదరగొట్టారు. ఈ సంఘటనపై బీజేపీ సోమవారం బోధన్ బంద్ కు పిలుపునిచ్చింది. ఇక, బోధన్‌లో పరిస్థితులు ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
