Asianet News TeluguAsianet News Telugu

నిర్మల్ లో వరద బీభత్సం: ఇంద్రకరణ్ రెడ్డికి ఫోన్ చేసిన కేసీఆర్

నిర్మల్ లో వరద బీభత్సం సృష్టిస్తోంది. వరదల్లో ఓ గర్భిణీతో పాటు ఓ బాలుడు చిక్కుకున్నారు. వెంటనే మంత్రి అంద్రకరణ్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. సహాయ బృందాలు ఆ ఇద్దరిని కూడా రక్షించాయి.

Nirmal floods: Telangana CM KCR calls minister Indrakarana Reddy
Author
Nirmal, First Published Jul 22, 2021, 5:40 PM IST

నిర్మల్: ఎడ‌తెరిపి లేని వ‌ర్షాల వ‌ల్ల నిర్మ‌ల్  ప‌ట్ట‌ణంలోని వ‌ర‌ద ప్రాంతాల్లో ప‌రిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం...అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  వర‌ద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా  చర్యలు తీసుకోవాలన్నారు. 

మ‌రో 24 గంట‌ల పాటు  అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన చోట యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. ఏ ఒక్కరి ప్రాణం పోకుండా కాపాడడమే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. సహాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టడానికి నిర్మ‌ల్ కు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామ‌న్నారు.

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఎడ‌తెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాలకు మునిగిపోయిన లోతట్టు ప్రాంతాల్లో  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి గురువారం పర్యటించారు. ఉద‌యం 7.30 గంట‌ల నుంచి వరద ప్రభావిత ప్రాంతాను మంత్రి ప‌రిశీలిస్తున్నారు. ప‌లు కాల‌నీల్లోబాధితులతో స్వయంగా మాట్లాడిన మంత్రి... వారి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంట క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ ఫారూఖీ, నిర్మ‌ల్ మున్సిప‌ల్ చైర్మ‌న్ గండ్ర‌త్ ఈశ్వ‌ర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్య‌ద‌ర్శి స‌త్య‌నారాయ‌ణ గౌడ్, కౌన్సిల‌ర్లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు. 

జీఎన్ ఆర్ కాల‌నీలో ఓ బాలింత జ‌ల దిగ్బంధంలో చిక్కుకున్న విష‌యం మంత్రి దృష్టికి రాగానే వెంట‌నే అక్క‌డికి చేరుకున్న మంత్రి...  ద‌గ్గ‌ర ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షించారు. ఆ బాలింత‌ను, 11 రోజుల వ‌యసున్న‌ బాబును, అదే కాల‌నీకి చెందిన ఓ యువ‌కుడిని రెస్క్యూ టీం తెప్ప‌ల‌పై సుర‌క్షింతంగా బ‌య‌ట‌కు తెచ్చారు.  

ఎడ‌తెరిపి లేని వర్షాల వ‌ల్ల నిర్మ‌ల్ ప‌ట్ట‌ణం చుట్టూ ఉన్న వాగులు, వంక‌లు పొంగిపొర్లుతున్నాయి. చెరువుల అలుగు పారుతున్నాయని, ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేర‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండలా మారాయని ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు దీంతో శ్రీరాం సాగ‌ర్, స్వ‌ర్ణ ప్రాజెక్ట్ గేట్ల‌ను ఎత్తివేశారు. వాగులు ఉదృతంగా ప్ర‌వ‌హిస్తుండ‌టంతో లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల మ‌య‌మ‌య్యాయి. దీంతో నిర్మ‌ల్ ప‌ట్ట‌ణ ఎగువ భాగంలో ప‌లు కాల‌నీలు నీట మునిగాయని చెప్పారు. 

సుమారు 300 మంది వ‌ర‌కు జ‌ల‌దిగ్బంధంలో చిక్కుకున్నారని చెప్పారు ఇప్ప‌టికే స్థానికంగా ఉన్న గ‌జ ఈత‌గాళ్లు, రెస్క్యూ టీంల‌తో బాధితుల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు చేర‌వేస్తున్నారని, మ‌రి కొంత మందిని లోత‌ట్టు ప్రాంతాల నుంచి సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తున్నారని ఇంద్రరణ్ రెడ్డి చెప్పారు 

నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని కొన్ని కాల‌నీల్లో ప‌రిస్థితి హృద‌య‌విదాక‌రంగా ఉందని,  ప్ర‌జ‌లు ఎలాంటి ఆందోళ‌న చెంద‌వ‌ద్దు. అధికారులు, ప్ర‌జాప్ర‌తినిదులు క్షేత్ర‌స్థాయిలో ఉండి స‌హాయ‌క చ‌ర్య‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తున్నారని అన్నారు. నిత్య‌వ‌స‌రాలు, తాగునీటి కొర‌త లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ప్ర‌జ‌లు కూడా అప్ర‌మ‌త్తంగా ఉండాలి. నీటిలో చిక్కుకున్న కాల‌నీ వాసుల‌కు స్థానికులు  అండ‌గా నిల‌వాలని ఆయన సూచించారు. 

ఇవాళ సాయంత్రాని క‌ల్లా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చేరుకుని, స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డ‌తాయని, ఇన్ ఫ్లో త‌గ్గుతుండ‌టంతో  స్వ‌ర్ణ ప్రాజెక్ట్ గేట్ల‌ను అధికారులు కొద్దిసేప‌ట్లో మూసివేయ‌నున్నారని,  లోత‌ట్టు ప్రాంత ప్ర‌జ‌ల‌కు ఇది కొంత ఊర‌ట‌నిస్తుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios