Asianet News TeluguAsianet News Telugu

లాక్ డౌన్ మహిమ: కరోనాను తరిమేస్తున్న తెలంగాణ జిల్లాలు ఇవే....

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ సత్ఫలితాలు ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. కరీంనగర్ నేర్పిన పాఠంతో ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు 9 జిల్లాలు కరోనా వైరస్ ముప్పు నుంచి బయటపడ్డాయి.

Nine out of 33 districts in Telangana are free from Coronavirus
Author
Hyderabad, First Published Apr 25, 2020, 8:47 AM IST

హైదరాబాద్: తెలంగాణలోని 33 జిల్లాల్లో 30 శాతం జిల్లాలో కోవిడ్ -19 కేసుల నుంచి బయటపడినట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వైరస్ ముందుకు వచ్చినప్పటి నుంచి కరోనా వైరస్ కేసులు నమోదు కాని జిల్లాలు కూడా తెలంగాణలో ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో కరోనా వైరస్ పాజిటివ్ రోగులు నయమై డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఆ జిల్లాలు కరోనా వైరస్ ముప్పు నుంచి బయటపడ్డాయి.

తెలంగాణలో మొత్తం 33 జిల్లాలు ఉండగా, 9 జిల్లాల్లో గత కొద్ది వారాలుగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం లేదు. ఈ తొమ్మిది జిల్లాల్లో యాదాద్రి - భువనగిరి, వనపర్తి, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. సిద్ధిపేట, భద్రాద్రి - కొత్తగూడెం, ములుగు, నాగర్ కర్నూలు, నారాయణపేట, మహబూబాబాద్ జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, కరోనా వైరస్ రోగులు చికిత్స పొంది అందరూ కోలుకున్నారు. దీంతో ఈ జిల్లాలు కూడా కరోనా వైరస్ వ్యాధి నుంచి బయటపడ్డాయి.

జగిత్యాల, భూపాలపల్లి, పెద్దపల్లి, ఆసిఫాబాద్, రాజన్న - సిరిసిల్ల, మెదక్ జిల్లాలు కూడా మరో వారంలో కరోనా వైరస్ బారి నుంచి బయటపడుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.  ఈ జిల్లాల్లో రెండు, మూడు చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాల్లోని కరోనా వైరస్ రోగులు కొద్ది రోజుల్లో కోలుకుని కరోనా బారి నుంచి బయటపడుతాయి. 

హైదరాబాదు తర్వాత అతి భయంకరంగా కనిపించిన కరీంనగర్ జిల్లా క్రమంగా ఊరట పొందింది. ఈ నెలాఖరు నాటికి కరీంనగర్ కరోనా వైరస్ నుంచి విముక్తమవుతుందని అంచనా వేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాదు తర్వాత ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నవి సూర్యాపేట, గద్వాల జిల్లాలే.

నిజామాబాద్ లో 58, వికారాబాద్ జిల్లాలో 33 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ రెండు జిల్లాల్లో కొత్త కేసులు నమోదు కావడం లేదు. తెలంగాణలో లాక్ డౌన్ అమలు తగిన ఫలితాలు ఇస్తున్న సూచనలు కనపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాదులో 20 కంటైన్మెంట్ల జోన్లను ఉపసంహరించింది.

Follow Us:
Download App:
  • android
  • ios