ఒకరినొకరు ప్రాణంగా నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు. ఇంట్లో వాళ్లు అంగీకరించకున్నా...పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కానీ చివరకు పెళ్లైన నాలుగు నెలలకే... ఉరివేసుకొని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజరాహిల్స్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కరీంనగర్‌ జిల్లా గోదావరిఖనికి చెందిన సంతోష్ గౌడ్‌ విశ్రాంత సింగరేణి ఉద్యోగి కుమారుడు. డిగ్రీ వరకు చదివి నగరంలో ఎయిర్‌టెల్‌ స్టోర్‌లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి చెందిన అర్చన తల్లిదండ్రులు ప్రభుత్వ ఉపాధ్యాయులు. అర్చన నగరంలోనే బీటెక్‌, ఎంటెక్‌ పూర్తి చేసింది.
 
ఆమె బీటెక్‌ చదివే సమయంలో ఓ స్నేహితుడి ద్వారా సంతోష్ కు పరిచయం అయింది. నాలుగేళ్ల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అర్చన తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో మంచిర్యాలలో జరిగింది. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12లోని శ్రీరాంనగర్‌లో కాపురం పెట్టారు. 

అర్చన కూడా ఓ మొబైల్‌ షాపులో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది.  ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే..  సడెన్ గా  ఇద్దరి మధ్య ఏదో చిన్న వివాదం తలెత్తి గొడవ పడ్డడట్టు సమాచారం. ఆ విషయంలోనే ఇద్దరూ ఒకరినొకరు నొప్పించుకునేలా మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో మనోవేదనకు గురై ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.