ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకుందామని అనుకున్నారు. కానీ వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో... వారిని ఎదురించి ఒక్కటయ్యారు. అయితే... తమను కాదని పెళ్లి చేసుకున్న దంపతులపై పెద్దలు కత్తులతో దాడికి తెగబడ్డారు. పట్ట పగలు నడి రోడ్డుపై చంపేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటన హైదారబాద్ నగరంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే...సంగారెడ్డి సమీపంలోని శాంతినగర్‌కు చెందిన షేక్‌ ఇంతియాజ్‌(21) నాంపల్లిలోని ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. బోరబండలో నివసిస్తున్న బంధువు సయ్యద్‌ ఆలీ ఇంటికి తరచూ వచ్చిపోతుండేవాడు. ఈ క్రమంలో ఆయన కుమార్తె సయ్యద్‌ జైనా ఫాతిమా(19)తో పరిచయం కాస్తా ప్రేమగా మారింది. విషయం ఇరు కుటుంబాలకు తెలిసినప్పటికీ అమ్మాయి తరఫు వారు వివాహానికి అంగీకరించలేదు. దీంతో  వారు రంజాన్‌ రోజున సదాశివపేటలోని ఓ దర్గా సమీపంలో ఒక్కటయ్యారు.

ఈ క్రమంలో కుమార్తె కనిపించడం లేదంటూ రెండు రోజుల కిందట యువతి తండ్రి ఆలీ ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంగారెడ్డి వెళ్లి అక్కడి పోలీసులను కూడా సంప్రదించాడు. అక్కడ పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో.. కూతురు, అల్లుడిని ఏమీ చేయనని హామీ ఇచ్చాడు. వారిని ప్రేమగా చూసుకుంటామని మాయమాటలు చెప్పాడు.

అలా వాళ్లను నమ్మించి వెంటనే అమీర్ పేటలో వాళ్లపై కత్తులతో దాడి చేశాడు. ఇంతియాజ్, ఫాతీమాలపై దాదాపు 10మంది వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో ఇంతియాజ్ తీవ్రంగా గాయపడగా.. ఫాతిమాకి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.