సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ గచ్చిబౌలి డైమండ్ హిల్స్‌కు చెందిన కుర్మ య్య , అతని భార్య చిట్టెమ్మ  మంగళవారం సౌతిండియా షాపింగ్ మాల్ వద్ద ఫుట్‌పాత్‌పై నడుస్తూ రోడ్డు దాటుతున్నారు.

ఈ క్రమంలో జయరామ్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన బైక్‌పై వేగంగా వచ్చి కుర్మయ్యను ఢీకొట్టాడు. దీంతో కుర్మయ్య ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన అతనిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ కుర్మయ్య ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన టెక్కీ జయరామ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఇతను సీతాఫల్‌మండిలో ఉంటూ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.

మరో ఘటనలో 19 ఏళ్ల  ఇంజనీరింగ్ విద్యార్ధి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద రెడ్ సిగ్నల్ పడినప్పటికీ కారును నడిపి బీభత్సం సృష్టించాడు. వేగంగా ముందుకు నడిపి ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టి.. మరో వాహనాన్ని ఢీకొని వాహనదారులను భయాందోళనలకు గురిచేశాడు.

కారు నెంబర్ ఏపీ 28వై 9799 ఆధారంగా ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. వరుస సంఘటనలతో ఆ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు.