ఖమ్మం: తెలంగాణలోని ముందస్తు ఎన్నికలను తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీతో కలవడం పెద్ద చర్చనీయాంశంగా మారింది.  

రాజకీయాల్లో విభిన్న వైరుద్యాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలయికను ప్రజలు ఎలా స్వాగతిస్తారా అన్నది సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు బీజేపీపై పోరుకు  ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలను కలుపుకు పోతున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని ఇప్పటికే చంద్రబాబు, రాహుల్ గాంధీలు ప్రకటించారు. 

అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు లు పొత్తు అనంతరం తొలిసారిగా కలుస్తున్న నేపథ్యంలో అందులోనూ ఒకే వేదికపై ఇద్దరు నేతలు ప్రసంగించనున్న నేపథ్యం ఆసక్తి నెలకొంది. 

తెలంగాణ వ్యాప్తంగా గులాబీ బాస్ కేసీఆర్ చంద్రబాబు నాయుడును చాలా ఘాటుగా విమర్శిస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీ సైతం చంద్రబాబును విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల సభలో ఎలాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారా అన్నది ఉత్కంఠ నెలకొంది. 

అటు రాహుల్ గాంధీ సైతం ఎలాంటి ప్రకటన చేయబోతున్నారా అన్న అంశంపై అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం పార్టీ నేతలు సైతం ఆశగా ఎదురుచూస్తున్నారు. జాతీయ పార్టీలు సైతం చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీల కలయిక ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.