హైదరాబాద్: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యబోతున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పలువురు అభినందనలతో ముంచెత్తారు. తెలంగాణ ముందస్తు ఎన్నికలు దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. 

జాతీయ పార్టీలు రెక్కలు కట్టుకువాలిపోయాయి. బీజేపీ నుంచి ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాతోపాటు పలువురు కేంద్రమంత్రులు తెలంగాణలో ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 

అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత్రి మాయావతితో పాటు ఇతర జాతీయ పార్టీలు తెలంగాణలోనే తిష్టవేశాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ఓటరు ఎలాంటి తీర్పు ఇస్తున్నారో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 

అయితే ఎన్నికల ఫలితాల్లో వార్ వన్ సైడ్ అన్నట్లు అధికార టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది.  ప్రజాకూటమిని కానీ బీజేపీని కానీ కారు జోరు ముందు డీలాపడ్డాయి. కారు వేగం ముందు బొక్కబోర్లా పడ్డాయి. 

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. దేశ నలుమూలల నుంచి ఫోన్లు చేసి శుభాకాంక్షలు తెలిపారు. 

అటు ఏపీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. తెలంగాణలో ప్రజాతీర్పును తెలుగుదేశం పార్టీ గౌరవిస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు తన అభినందనలు చెప్తూ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఐదురాష్ట్రాల్లో గెలుపొందిన శాసనసభ్యులు అందరికి చంద్రబాబు అభినందనలు తెలిపారు. అయితే దేశవ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పూర్తిగా బలహనీ పడిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఎపి ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి అభినందనలు తెలిపారు. అటు ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ద్వారా గెలుపొందిన అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

సినీ ఇండస్ట్రీ నుంచి సూపర్ స్టార్ కృష్ణ సైతం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు సూపర్‌స్టార్‌ కృష్ణ ఓ ప్రకటన విడుదల చేశారు. నాలుగున్నరేళ్ల కాలం పరిపాలన తర్వాత ఇంత అత్యధిక స్థానాలలో విజయం సాధించి మళ్లీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం. 

కేసీఆర్‌ గారు ప్రవేశ పెట్టిన పథకాలన్నీ ప్రజలకి ఎంతో మేలు చేశాయి. అందుకే అన్ని వర్గాల ప్రజలు ఆయనకి ఈ అఖండ విజయాన్ని అందించారు. మళ్లీ రెండోసారి తెలంగాణకి ముఖ్యమంత్రిగా బాధ్యతల చేపడుతున్న కె. చంద్రశేఖర్‌రావు గారికి నా హృదయపూర్వక అభినందనలు’ అని కృష్ణ ప్రకటనలో పేర్కొన్నారు.