Asianet News TeluguAsianet News Telugu

జాతీయ చేనేత దినోత్సవ సందర్భం – ముఖాముఖి

“బానిస కూడా సంకెళ్ళను తెంచుకోవడానికి ప్రయత్నించాలి” శ్యామసుందరి

national handlooms day special
Author
Hyderabad, First Published Aug 7, 2020, 12:00 PM IST

శ్యామసుందరి గారు దస్తకార్ ఆంధ్ర వర్కింగ్ ట్రస్టీ. తాను చేనేత రంగంలో పద్దెనిమిది ఏండ్లుగా కృషిచేస్తున్నారు. గ్రామీణ ఉపాధి పోషణకు సహకరించే ఈ రంగాన్ని పరిపుష్టం చేయడం,వృత్తిలో ఉన్న నేతకారులు, సహకార సంఘాలతో కలిసి పని చేయడం, వారికి ఆధునిక డిజైన్లు, సాంకేతికతను అందించడం, ప్రభుత్వ పాలసీనిర్ణయాల్లో సలహా సూచనలు ఇవ్వడం, ఈ రంగానికి అవసరమైన పరిశోధనలకు పూనుకోవడం - ఇత్యాది వారి కార్యరంగం. కేంద్ర ప్రభుతానికి చెందిన జాతీయ హ్యాండ్ లూం బోర్డు మెంబర్ గా కూడా ఆమె ఉన్నారు.

రెండేళ్ళ క్రితం క్షేత్ర స్థాయిలో చేనేత స్థితిగతులను అధ్యయనం చేసిన పిదప నేను స్వయంగా చూసిన విషయాలను, అనుభవాలను వారితో పంచుకోగా ఆమె ఎంతో ఆవేదనతో అనేక విషయాలను నిర్మోహమాటంగా పంచుకున్నారు. ముఖ్యంగా “దారం నేతకారుడి చేతులోంచి జారిపోవడమే కాదు, దేశీయ మార్కెట్లు కూడా తనకు దూరం అయ్యాయి” అని వారు తన మనోగతాన్ని స్పష్టంగా వివరించారు. అయితే, సమస్యలకు కేవలం ప్రభుత్వాన్ని బాధ్యులను చేయడం ఒక్కటే పరిష్కారం కాదని, నేతకారులు కూడా తమ బాధ్యతను  విస్మరిస్తున్నారని వారు ప్రస్తావించడం విశేషం. “బానిస కూడాసంకెళ్ళను తెంచుకోవడానికి ప్రయత్నించాలి. లేనిదే ఆ సంకెళ్ళుతెగవు” అంటూ ఆమె ఎంతో దూరదృష్టితో కొన్ని కటువైన నిజాలను పంచుకున్నారు. చేనేత వృత్తి పునరుజ్జీవనం పట్ల అందరూ బాధ్యతఎరిగి ప్రవర్తించాలని సూచించారు.

నేడు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా అనేక అంశాలపై వారు వెలుబుచ్చిన అభిప్రాయాలు చదవడం మనలో ఒక బాధ్యతకు, అవసరమైన మెలుకువకు, దీర్ఘకాలిక చర్యలకు ఉపకరిస్తాయని భావిస్తూ, ఆ ముఖాముఖి ముఖ్యాంశాలు మీ కోసం...- కందుకూరి రమేష్ బాబు

national handlooms day special

 అరవై ఏండ్లకు పైబడిన స్వతంత్ర భారత ప్రస్థానంలో చేనేత కారుడి చేతుల్లోంచి ‘దారం’ (కాటన్, నూలు) ఎప్పుడో జారి పొయింది.స్వయంగా తాను కొనుగోలు చేయడం ఎన్నడో మానేసాడు. అనేక కారణాలవల్ల ఇప్పటికి కూడా తాను నేసే వస్త్రానికి అవసరమైన నూలు స్వయంగా కొనుగోలు చేయడం కుదరని పని. అంతేగాక స్థానిక మార్కెట్లు దూరాలకు తరలిపోవడంతో ఆ నూలుతో వస్త్రాన్ని నేసి,తానే ఆయా మార్కెట్లకు తీసుకెళ్ళి అమ్మే పరిస్థితి లేదు. దాంతో  తప్పనిసరిగా మాస్టర్ వీవర్ పైన గాని, సహకార సంఘ వ్యవస్థపై గానీ ఆధారపడవసిందే. వారితోనే తాను తయారు చేసిన వస్త్రాని మార్కెట్ చేసుకోక తప్పని స్థితిలో నేతకారుడు ఉన్నాడు. మరో వంక సహకార సంఘాలు కూడా నేడు దివాళా తీశాయి. ఈ తరుణంలో అతడికి మిగిలిన ఏకైక దిక్కు మాస్టర్ వీవరే అని చెప్పాలి. పరిస్థితి ఇలా ఉండగా ప్రభుత్వం నేత కారుడిని యజమానిగా మార్చేందుకు గాను యాభై శాతం యార్న్ సబ్సిడీ ఇస్తాం అని ఇన్ పుట్ సబ్సిడీ పథకాన్నిరూపొందించింది. నేతకారుడికి కనీసం పదిహేనువేల స్థిర ఆదాయం  లభించేలా చేయాలన్న యోచనలో భాగంగా రూపొందించిన పథకాల్లో ఈ యార్న్ సబ్సిడీ పథకం ఒకటని చెబుతున్నారు. ఐతే, ఇది నేతకారుడికి ప్రయోజనం చేకూర్చక పోగా తిరిగి సహజంగానే మాస్టర్ వీవర్ కి లబ్ది చేకూర్చే పథకంగా మారే అవకాశమే ఉంది. ఆచరణలో ఇది విఫలప్రయోగమే అవుతుంది.

national handlooms day special

 నిజానికి నేతకారుడికీ మార్కెట్ కు మధ్య ఎప్పటికైనా ఒకకేంద్రీకృత వ్యవస్థ అవసరం. అందుకోసం సహకార సంఘం గానీ మాస్టర్ వీవర్ గానీ కావాల్సిందే. ఐతే, మాస్టర్ వీవర్ పై  ఆధారపడకుండా,ఎప్పటికైనా సహకార రంగాన్ని బలోపేతం చేసుకోవడంతోనే నేతకారుడికి గొప్ప మేలు జరుగుతుంది. ప్రభుత్వం ఆ దిశలో కృషి చేయవలసి ఉంది. నేటి ప్రభుత్వం జియో ట్యాగింగ్ చేసి, ఎలాగైతే పని చేస్తున్న మగ్గాలను గుర్తించిందో, అలాగే బాగా పని చేస్తున్న సహకార సంఘాలను కూడా గుర్తించి, వాళ్ళ ఆచరణ నుంచి మిగితా సంఘాలను బలోపేతం చేయడమే చాలా అవసరం.

national handlooms day special

 గతంలో తెలంగాణకు ఖ్యాతి తెచ్చిన బ్రాండ్లు ఎన్నో ఉన్నాయి. అవి ఇప్పుడు వాటి గుణాన్ని కోల్పోయాయి. ఆచరణలో ‘పోచంపల్లి’, ‘గద్వాల’ అని ఇంకా వాటి పేర్లు చెబుతున్నాం గానీ ఒకనాటి వస్త్రాలు వారిప్పుడు నేయడంలేదు. ఆయా డిజైన్లు, వస్త్రాలకు పెద్ద ఎత్తున అనుకరణలు ఇప్పుడు మార్కెట్లను ముంచెత్తాయి. చేనేత పేరుతోనే మర మగ్గాలపై నేసిన వస్త్రాలు ఆయా బ్రాండ్ల పేరుతో చెలామణిలో ఉన్నాయి. ఇందుకు టెస్కో కూడా మినహాయింపు కాదు. అందుకే ముందు టెస్కో నుంచి ప్రక్షాళన జరగాలి. వారి తరపున జరిపే వస్త్ర ప్రదర్శనలో కూడా కేవలం చేనేత వస్త్రాలే పెట్టేలా నిర్ణయం తీసుకోవాలి. తక్కువ ఉత్పత్తి ఐనా సరే, తాము అమ్మకాలు జరిపేవి పూర్తిగా చేనేత వస్త్రాలే అని గుండె మీద చేయి వేస్కొని చెప్పే స్థితి రావాలి. అప్పుడే ఆయా బ్రాండ్లకు పేరు.పునరుజ్జేవనం ఉంటుంది.

 ప్రభుత్వం సేకరించే వస్త్రాలలో కూడా చేనేతవి కాకుండా మర నేత వస్త్రాలు ఉంటున్నాయి. వీటితోనే ఆన్ లైన్ వ్యాపారం కూడా చేయడం జరుగుతోంది. అవి గమనిస్తుంటే, అదుపు చేసే వ్యవస్థే ఇలాచేయడంతో ఇక ఎవరికి చెప్పుకోవడం? అన్న ప్రశ్న తలెత్తుతున్నది.

 చేనేత సంక్షోభానికి ప్రభుత్వ వైఫల్యం ఒక కారణం కాగా నిజానికి ఇందుకు ప్రధాన కారణం చేనేత కారుల స్వయంకృతాపరాధమే అంటే ఎవరికైనా మనస్సు చివుక్కు మంటుంది. కానీ ఈ చెడు నిజం అంగీకరించక తప్పదు. మాస్టర్ వీవర్లు కూడా వేరే కులస్తులు కాదు. పద్మశాలీలే. తమ కులం వారే తమ వృత్తి పట్ల ఆసక్తి చూపకపోవడం, బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించడం అసలు సంక్షోభానికి మూల కారణం. ఉత్పత్తి, మార్కెటింగ్ విషయాల్లో రెండిట్లోనూ తన సహకారం లేకుండా మర మగ్గాల వస్త్రాలు, ఇమిటేషన్లు -బయట చెలామణిలో ఉండవు. చాలా చోట్ల తానే నించొని యజమాని చెప్పిన వస్త్రాలను నేతకారుడు అమ్ముతున్నాడు. మౌనంగా ఇటువంటి అనైతిక చర్యలకు వంతపాడుతూ, సంక్షోభాన్ని తానే స్వయంగా ఆహ్వానించాడు. అందుకే చేనేత సంక్షోభం గురించి మాట్లాడితే, ఆత్మ విమర్శ చేసుకునే దిశలో గనుక చెప్పుకుంటే, ఇది స్వయంకృతాపరాధమే అని కూడా
చెప్పవలసి వస్తుంది.

 ఇదిలా ఉంటే, వృత్తిలో ఇప్పటికే ఉన్నవారిని ఆదరించడం, కొత్తగా వచ్చే వారిని ఆహ్వానించడం- ఈ రెండు విషయాల్లో ప్రభుత్వం మొదటి వైపు దృష్టి పెట్టింది. రెండోది, భవిష్యత్తుకు అధారమైన యువతరం పట్ల విధానపరమైన దృక్పథాన్ని తీసుకోలేదు. దీన్ని తక్షణం స్వీకరించాలి. అప్పుడే ఈ వృత్తి మరింత బాగు పడుతుంది. రేపటి రోజుపైన భరోసా కలుగుతుంది. అందుకోసం ఉన్న వారిని ఆదరిస్తూ కొత్త వారికి ఆహ్వానం పలికే దిశలో చేనేత విధానాన్ని రూపొందించడం తప్పదు. ప్రభుత్వం ఈ సూచన శ్రద్ధగా  పట్టించుకోవాలి.

national handlooms day special

 నేతకారుడు పని తప్పా మరోటి కోరుకోడు. పనికి కనీస గిట్టుబాటు ధర కావాలని మాత్రమే అనుకుంటాడు. తాను జీవించినంతకాలం తన నైపుణ్యానికి పదును పెట్టుకుంటూ ఈ వృత్తిలోనే ఉంటాడు. అద్బుతమైన ఈ నేత రూపకం తమతోనే అంతరించి పోకుండా ఉండాలని తపిస్తాడు. అందుకే, ముందు ఉన్న వారికి జీవగంజి పోయడం, ఉన్నంతలో ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి, నేసిన బట్టను కొనుగోలు చేయడంతో పాటు, తక్షణం వారి జీవితాలకు మరింత వెసులుబాటు కల్పించేందుకు యాభై ఏండ్లు నిండిన వారికి ఇస్తున్న వేయి రూపాయల పెన్షన్ ను పెంచడం మంచిది. చేనేతను కాపాడుతున్న ఈ వృద్ధతరానికి మానవీయ దృక్పథంతో నెలనెలా మూడు వేల రూపాయల పెన్షన్ ఇవ్వడం అవసరం.
 నూతనంగా ప్రభుత్వం నూలు, రసాయనాల కొనుగోలు కోసం యార్న్ సబ్సిడీ పథకం ద్వారా నలభై శాతంలో 35 శాతం డబ్బులను నేతకారుడి ఖాతాలో వేయాలని భావిస్తున్నది. ఇది ఆచరణలో సఫలం కాదు. దీనికి బదులు ఆ వెచ్చించే డబ్బులను నేరుగా నేతకారుడికి లభ్ది చేకూర్చే పెన్షన్ పథకంగా మార్చి ఇవ్వడం మంచిదని నా సూచన. దీనివల్ల కళ అంతరించిపోకుండా కాపాడుతున్న నేతకారులకు మంచి ఆధారంగా ఏర్పడుతుంది. చేతనైనన్ని రోజులు వాళ్ళు పనిచేయడానికి గొప్ప ప్ర్రేరణ ఇస్తుంది.

 ఇదే తరుణంలో తర్వాతి తరాలు కూడా ఈ వృత్తిలో ఉపాధి పొందాలంటే అందుకు కారణం ఈ వృత్తిలో నెలకొంటున్న సంక్షోభానికి అసలు మౌలిక కారణాలేమిటో ప్రభుత్వం నిజాయితీగా అన్వేషించి పరిష్కారానికి పూనుకోవాలి.

national handlooms day special

 గత రెండు దశాభ్దాల పరిస్థితులను పరిశీలిస్తే, సంక్షోభానికి మూల కారణం, ‘దారం’ అనే చెప్పాలి. అవును. ‘నూలు’. దీని రేట్లు ఏడాదికి మూడుసార్లు పెరుగుతున్నవి. పెరిగిన నూలు రేట్లకు అనుగుణంగా మార్కెట్లో కార్మికుడు నేసే వస్త్రం ధర పెంచే స్థితి లేదు.అలాగే, అతడి వేతనం పెరిగే ప్రసక్తీ లేదు. పోనీ, ఈ నూలు ధరల హెచ్చు తగ్గులపై ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందా అంటే అదీ ఉండదు. ఇలాంటి స్థితిలో సంక్షోభం తలెత్తే పరిస్థితి భవిష్యత్తులో ఉండటం ఖాయమనే చెప్పాలి. అలా అని ఈ సమస్యను ప్రభుత్వం గుర్తించ నిరాకరిస్తే చేనేత రంగంలోకి నూతన తరం రాలేదు. కాబట్టి, ప్రభుత్వం ఈ వృత్తిని శాశ్వతంగా కాపాడాలని అనుకుంటే, కొత్త తరాలు నిరంతరాయంగా ఇందులోకి వచ్చి ఉపాధి పొందాలంటే, తనంతట తాను పెరిగిన భారాన్ని భరించే బాధ్యత తీసుకోవాలి. మార్కెట్ రేట్లని నియంత్రించదానికి ప్రయత్నిస్తూ, పెరిగిన నూలు రేట్ల విషయంలో ప్రభుత్వం నేతన్నలకు తప్పనిసరిగా మద్దతు ఇచ్చి, ‘మీకు వెన్నుదన్నుగా మేమున్నాం’ అన్న భరోసా ఇవ్వాలి. అప్పుడు శాశ్వతంగా ఈ వృత్తి మనుగడలో ఉంటుంది. యువతరం నిరభ్యరంతరంగా వచ్చి చేరుతుంది. వారు పట్టణాలకు వలస పోవడం మాని, ఉన్న వూర్లో ఉపాధి పొందుతూ, ఇంటి పట్టున హాయిగా వృత్తి జీవితం గడుపుతారు. తద్వారా మన వారసత్వ సంపదను సగర్వంగా కాపాడుకున్న వాళ్ళమూ అవుతాం. ఈ దిశగా ఆలోచించకుండా వృత్తిలో ఉన్న వారికోసం కంటి తుడుపు చర్యలు, ‘ఇందులోకి వచ్చే వారు లేరు కదా!’ అని చేనేతను నిర్లక్ష్యం చేయడం, స్వీయ అస్తిత్వంతో రాష్ట్రం సాధించుకున్న తెలంగాణకు మంచిది కాదు. అది వివేకం అనిపించుకోదు కూడా.

 రేపటి తరం కూడా వచ్చి చేరాలి అనడానికి మరో ముఖ్య కారణం చేనేతకు గొప్ప డిమాండ్ ఉండటం అని గుర్తించాలి. విదేశాలు సరే, దేశీయ మార్కెట్లో కూడా చేనేత వస్త్రాలకు రోజు రోజుకూ డిమాండ్ పెరుగుతున్నదే తప్ప తరగడం లేదు. నిజానికి నేసే వారు తగ్గిపోతున్నారు. కొత్తగా వచ్చేవారికి నమ్మిక ఇచ్చే దిశలో ప్రభుత్వం లేదు. విషాదం ఏమిటంటే, చేనేత పేరుతో మర మగ్గాల వస్త్రాలు అమ్ముడు పోతుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ విషయాలను ఇప్పటికైనా గమనించి, ప్రభుత్వం చేనేతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ, వృత్తిలో ఉన్న నేతకారులకు ఆధునిక డిజైన్లు, సాంకేతికత అందిస్తూ వారిని మొదట దగ్గరకు తీసుకోవాలి. దీనికి తోడు నూలు విక్రయాల్లో మద్ధతు ధర ఇవ్వడానికి పూనుకుని రేపటి తరానికి ఆశావహ భవిష్యత్తు చూపాలి. అప్పుడే ఈ వృత్తి ఒక పరంపరగా ముందుకు సాగుతుంది. చేనేత పునరుజ్జీవనం చాలా తేలికగా జరిగిపోతుంది.

national handlooms day special

 అన్నట్టు, ఒకనాడు నేత పనిలోని ప్రతి విభాగం తాలూకు పనిపై నేతకారుడు స్వయం పర్యవేక్షణ, అజమాయిషీ ఉన్నందువల్ల వస్త్రం నాణ్యత, డిజైన్లపై తనకి అధికారం ఉండేది. వస్త్రోత్పత్తి లాభాపేక్షకు అతీతంగా ఎంతో బాగుండేది. ఇవన్నీ గమనిస్తే, ఇప్పుడు నేతకారుడు ‘సాదా నేత పని’లో మాత్రమే ఉన్న దుస్థితిని మనం అంగీకరించక తప్పదు. కాబట్టే అతడి మాటకు గౌరవం లేకుండా పోయింది. మౌనంగా రోదిస్తున్నాడు.

 చేనేత రంగంలో కనిపించని అన్యాయం జరిగింది. జరుగుతున్నది. ప్రభుత్వాన్ని, మాస్టర్ వీవర్ ని నిందించడం కాదు, నేతకారుల బాధ్యత ఏమిటన్న విషయాన్ని ఇప్పటికైనా చర్చించకపోతే వ్యవస్థ సంక్షోభానికి సిసలైన కారణాలు వెలికిరావు.  ముందే చెప్పినట్లు, గ్రామీణ స్థాయిలో కుటీర పరిశ్రమగా ఉన్ననేతకారుడికి స్థానిక మార్కెట్లు దూరం వెళ్ళడంతో మొదట సమస్య ఏర్పడింది. ఆ మార్కెట్లు దూరం వెళ్ళడంతో వస్త్రాన్ని ఎట్లా అమ్మాలో, ఇంతకు అమ్మాలో నేతకారుడికి తెలియలేదు. దాంతో మాస్టర్ వీవర్ వచ్చి చేరాడు. మాస్టర్ వీవర్ కూడా వాళ్ళ లోంచే పుట్టుకు వచ్చాడని మరువకూడదు. 

 సహకార సంఘాలు చాలా వరకు బ్రష్టు పట్టాయి. సభ్యులైన నేతకారులకు అధ్యక్ష కార్యదర్శుల మీద ఉండే నమ్మకం, నమ్మక ద్రోహానికి దారితీసింది. విషాదం ఏమిటంటే, ఎగ్జిబిషన్లలో అమ్మే చేనేత వస్త్రాల్లో అధికం మర మగ్గాలపై తయారైనవే. వాటిని కూడా సహకార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు తామే ప్రైవేట్ గా తయారు చేయించి గుట్టు చప్పుడు కాకుండా సహకార సంఘం స్టాల్స్ లో అమ్ముతూ, లాభాలు గడించడం జరుగుతోంది.  సహకార సంఘం బాధ్యులకు, మాస్టర్ వీవర్లకూ- ప్రభుత్వ అధికారులైన ఏడీలు, టెస్కో అధికారులకూ మధ్య లాలూచీ పెరిగిపోయింది. అవినీతికి దోహదపడే ఈ లంకెలో ఒక అంచెనైనా తగ్గించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి.

 నేడు చేనేత పరిశ్రమను కుటీర పరిశ్రమ అనడం కూడా సబబు కాదు.  నల్లగొండ, భువనగిరి యాదాద్రి జిల్లాల్లోనే కాదు, తెలంగాణ అంతటా స్వయంగా చేనేతకారుడు ముడిసరకు కొని, పని చేసుకునే పరిస్థితే లేదు. ముందు చెప్పినట్టు దారం తన నుంచి చేజారింది. తర్వాత మగ్గంపై నేసే పనికి ముందుండే ఇతర పనులన్నీ మాస్టర్ వీవర్ దగ్గర విడగొట్టబడి, ‘రెడీ వార్పు’ నేతకారుడికి అందే పరిస్థితి వచ్చింది. దాంతో నేతకారుడి నైపుణ్యం తన చేతుల్లోంచి పొయిందనవచ్చు. ఫలితంగా మగ్గం మీద పనిచేయడం ఇప్పుడు
యాంత్రికంగా మారింది. దీంతో కట్టు, అద్దకం వేరే చోట, నేత పని ఇంకో చోట, ఇట్లా-మాస్టర్ వీవర్ల వద్ద వ్యవస్థ అంతా కేంద్రీకృతం కావడం జరిగింది. ఫలితంగా చేనేత ఒక కుటీర పరిశ్రమ అనే అర్థాన్ని కోల్పోతున్నది. అటు కుటీర పరిశ్రమ కాకుండా, ఇటు ఫ్యాక్టరీ కాకుండా రెండిటి మధ్య ఇరుక్కు పోయిందనే చెప్పాలి.

national handlooms day special

(కందుకూరి రమేష్ బాబు సీనియర్ జర్నలిస్టు, కొన్నేళ్లుగా తెలంగాణ చేనేత రంగంపై అధ్యయనం చేస్తున్నారు.)

Follow Us:
Download App:
  • android
  • ios