కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్విజయ్ సింగ్‌కు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దిన్ ఓవైసిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో దిగ్విజయ్‌ను అరెస్ట్ చేయాలంటూ కోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో కాంగ్రెస్ పార్టీలో కలకలం రేగింది.

ఇటీవల తెలంగాణ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ లో ప్రచారం నిర్వహించిన దిగ్విజయ్ ఎంఐఎం పార్టీ, అసదుద్దిన్ ను ఉద్దేశించి మాట్లాడారు. కేవలం బయపెట్టి డబ్బులు వసూలు చేసుకోడానికే ఎంఐఎం పార్టీని కొన్ని రాష్ట్రాల్లో అసదుద్దిన్ బరిలోకి దింపాడంటూ దిగ్విజయ్ వ్యాఖ్యానించడం తీవ్ర దమారం రేపింది. 

దిగ్విజయ్ వ్యాఖ్యలు ఎంఐఎం నాయకులు, కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేశాయి. ఈ వ్యాఖ్యల వల్ల తమ పార్టీకి, అధినేత పరువుకు భంగం కలిగిందంటూ ఎంఐఎం పార్టీ జనరల్ సెక్రటరీ హుస్సేన్ అన్వర్ ఏకంగా నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. 

దీనిపై పలుమార్లు విచారణ జరిపిన నాంపల్లి కోర్టు వ్యక్తిగతంగా దిగ్విజయ్ హాజరుకావాలని ఆదేశించింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా అతడు విచారణకు హాజరు కానందుకు నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తూ ఆదేశాలు వెలువరించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది.