నాంపల్లి ఎమ్మల్యే జాఫర్ హుస్సేన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే కుమారుడు మక్సూద్ హుస్సేన్(33) అతి చిన్న వయసులోనే మృత్యువాత పడ్డాడు. గత కొంతకాలంగా యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మక్సూద్.. గురువారం ఉదయం కన్నుమూశాడు.

మక్సూద్ గత పది సంవత్సరాలుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్నాడు. మూత్రపిండాల పనితీరు సరిగాలేకపోవడంతో 2009లో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చేశారు. మూడేళ్ల పాటు ఆయన జీవితం బాగానే సాగినప్పటికీ.. మళ్లీ సమస్య మొదలైంది. కొత్తగా అమర్చిన మూత్రపిండం కూడా సరిగా పనిచేయలేదు. అప్పటి నుంచి డయాలసిస్ పైనే ఆయన కొనసాగుతున్నారు.

కాగా.. గత నెల 23వ తేదీన మరోసారి ఆయన కిడ్నీ మార్పిడి చేశారు. అప్పటి నుంచి ఆయన పరిస్థితి మరింత విషమంగా మారింది. అప్పటి నుంచి నెల రోజులుగా ఆయన వెంటిలేటర్ పైనే చికిత్స పొందారు. కాగా.. గురువారం పరిస్థితి మరింత విషమంగా మారడంతో ఆయన కన్నుమూశారు.

కాగా.. ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, ఆయన కుటుంబసభ్యులను రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, ఎంఐఎం నేతలు పరామర్శించారు. మక్సూద్ మృతదేహానికి నివాళులర్పించారు.