వరంగల్‌లో జరుగుతున్న కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. మనల్ని ఇబ్బంది పెట్టిన ప్రతి ఒక్కరి సంగతి అప్పుడు చూద్దామని ఆయన హెచ్చరించారు. 

కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఏ విధంగా రైతులను మోసం చేస్తున్నాయో చెప్పేందుకు ఈ రైతు సంఘర్షణ సభ ఏర్పాటు చేసినట్లు నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వరంగల్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ రైతు సంఘర్షణ సభలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచి ఏం చేయబోతోందో ప్రకటిస్తామన్నారు. 2016లో నరేంద్ర మోడీ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పారని.. కానీ ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు. నరేంద్ర మోడీ నిర్వాకం వల్ల యావత్ భారత్ దేశంలో రైతుల ఆదాయం సగానికి సగం తగ్గిపోయిందని ఉత్తమ్ ఎద్దేవా చేశారు. 

నరేంద్ర మోడీ నిర్లక్ష్యం వల్లే ఎరువులు, ఫెర్టిలైజర్ల ధరలు రెట్టింపు అయ్యాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో కేసీఆర్ పదే పదే రైతాంగాన్ని మోసం చేస్తున్నారని ఉత్తమ్ ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ- టీఆర్ఎస్ ప్రభుత్వాలు రైతులను దగా చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టే మిర్చి పంట దిగుబడి పడిపోయిందని.. మిర్చి రైతును తెలంగాణలో ఆదుకునే నాధుడు లేడని ఫైరయ్యారు. 

కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేశామన్నారు. కానీ టీఆర్ఎస్ పాలనలో నాలుగేళ్లు దాటినా లక్ష రూపాయల రుణమాఫీని నిలబెట్టుకోలేదన్నారు. తాను పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు జవాబుగా మొత్తం భారతదేశంలో రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణయేనని ఉత్తమ్ చెప్పారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని.. ఎక్సట్రాలు చేసిన అధికారుల సంగతి చూస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ప్రతి విషయంలో దోపిడికి పాల్పడుతోందన్నారు. మనల్ని వేధిస్తున్న అందరీ లెక్క తేలుద్దామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 

అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. 2023లో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమన్నారు. రైతు బంధు పేరు చెప్పి అన్నింటినీ బంద్ చేశారని ఫైరయ్యారు. టీఆర్ఎస్‌కు బుద్ధి చెప్పడం కోసమే ఈ సభ నిర్వహిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు సంఘర్షణ సభ భవిష్యత్‌కి పునాది అని ఆయన పేర్కొన్నారు.