దుబాయ్ నుండి స్వదేశానికి వచ్చి ముంబై లో కిడ్నాప్ గురయిన జగిత్యాల జిల్లా వాసి శంకరయ్యను ఆఛూకి తమిళనాడు లభ్యమయినట్లు సమాచారం. ఆయన ప్రస్తుతం పోలీసుల వద్దే వున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ : దుబాయ్ నుండి చాలాకాలం తర్వాత స్వదేశానికి వచ్చిన జగిత్యాల జిల్లావాసి శంకరయ్య ముంబై ఎయర్ పోర్ట్ లో కిడ్నాప్ కు గురయిన విషయం తెలిసిందే. అతడిని కాళ్లుచేతులు కట్టేసిన ఫోటోలను కుటుంబసభ్యులకు పంపి రూ.15లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేయగా అంతడబ్బు ఇచ్చుకోలేక బాధిత కుటుంబం ముంబై పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన ముంబై పోలీసులు శంకరయ్యను కిడ్నాపర్ల చెరనుండి సురక్షితంగా కాపాడినట్లు సమాచారం.
బాధిత కుటుంబానికి కిడ్నాపర్ల ఫోన్ కాల్, వారి లాంగ్వేజ్, సాంకేతికత ఆధారంగా శంకరయ్యను తమిళనాడుకు చెందినవారు అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు సాగించిన ముంబై పోలీసులు నిందితులు మధురైలో వున్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందాలు శంకరయ్యను కాపాడి కిడ్నాపర్లను అరెస్ట్ చేసారు. నిందితుల రిమాండ్ అనంతరం శంకరయ్యను స్వగ్రామానికి పంపించే అవకాశాలు వున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే...
బ్రతుకుదెరువు, కుటుంబపోషణ కోసం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నందగిరి గ్రామానికి చెందిన శంకరయ్య కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు. ఇటీవల అతడు స్వదేశానికి వచ్చాడు. దుబాయ్ నుండి విమానంలో గత నెల (జూన్) 22వ తేదీన ముంబై విమానాశ్రయానికి శంకరయ్య చేరుకున్నాడు. అయితే ఎయిర్ పోర్ట్ బయట అతడిని గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ చేసారు.
శంకరయ్య కాళ్లు చేతులు కట్టేసి ఫోటోతీసి అతడి కుటుంబసభ్యులకు పంపించారు. రూ.15లక్షలు ఇచ్చి శంకరయ్యను విడిపించుకుని పోవాలని కుటుంబసభ్యులకు ఫోన్ చేసి డిమాండ్ చేసారు. దీంతో అంత డబ్బులు ఇచ్చుకునే ఆర్థిక పరిస్థితి ఆ కుటుంబానికి లేకపోవడంతో ముంబై పోలీసులను ఆశ్రయించారు.
బాధిత కుటుంబంతో కిడ్నాపర్లు తమిళంలో మాట్లాడటంతో తమిళనాడుకు చెందినవారే ఈ పని చేసివుంటారని పోలీసులు అనుమానించారు. ముంబై ఎయిర్ పోర్ట్ బయట ట్యాక్సీలో ఎక్కించుకుని అతడిని కిడ్నాప్ చేసినట్లు గుర్తించారు. దీంతో ఎయిర్ పోర్ట్ బయట సిసి కెమెరాలు, ఫోన్ నెంబర్ ఆదారంగా కిడ్నాపర్లను ముంబై పోలీసులు గుర్తించారు.
దుబాయ్ నుండి వచ్చిన శంకరయ్య వద్ద డబ్బులున్నాయనే అనుమానంతో ఈ కిడ్నాప్ చేశారని కూడా కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. శంకరయ్య వద్ద ఉన్న బ్యాగుల్లో డబ్బులు లేకపోవడంతో డబ్బుల కోసం తమకు ఫోన్ చేసి బెదరిస్తున్నారని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. మహారాష్ట్ర నుండి శంకరయ్యను తమిళనాడు రాష్ట్రంలోని మధురైకి తరలించగా పోలీసులు నిందితుల ఆఛూకీ కనుక్కున్నారు. వారినుండి శంకరయ్యను సురక్షితంగా కాపాడినట్లు తెలుస్తోంది.
