ములుగు జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. తాడ్వాయిలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. 

ములుగు జిల్లాకు చెందిన పలువురు టీఆర్‌ఎస్ నేతలు రహస్యంగా సమావేశం అయ్యారు. తాడ్వాయిలో ఈ సమావేశం నిర్వహించారు. ఇందులో టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన జిల్లా, మండల స్థాయి నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులు తమను చిన్నచూపు చూస్తున్నారని సమావేశానికి హాజరైన నేతలు బాధను వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో సొంత పార్టీ కార్యకర్తలను.. పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేశారని ఆవేదనను వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ నేతలకు ఇస్తున్న ప్రాధాన్యత తమకు ఇవ్వడం లేదని అసంతృప్తిని వెల్లడించారు. మంత్రి సత్యవతి రాథోడ్ అభివృద్ధికి నిధులు కూడా సరిగా ఇవ్వడం లేదని జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని సమావేశంలో పాల్గొన్న నేతలు నిర్ణయించారు. ఇందుకు సంబంధించి కేటీఆర్‌కు జిల్లా నేతలు లేఖ రాస్తున్నారు. 

ఇక, ఇటీవల మహబూబాబాద్ టీఆర్‌ఎస్‌లో వర్గ విబేధాలు వెలుగుచూసిన సంగతి తెలిసిందే. వడ్ల కొనుగోలుకు సంబంధించి టీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో నిరసన దీక్ష నిర్వహించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, ఎంపీ మాలోత్ కవిత రైతు దీక్షలో మాట్లాడుతుండగా స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ అడ్డుతగిలాడు. ఆమె చేతితో ఉన్న మైకును లాక్కున్నారు. దీంతో బిత్తరపోయిన కవిత కింద కూర్చొని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావుకు ఫిర్యాదు చేశారు. అటు వరంగల్ జిల్లాలోనూ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. 

ఆ తర్వాత కూడా సభాధ్యక్షత ఎవరు వహించాలన్న దానిపై కూడా నేతల మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి సత్యవతి రాథోడ్‌.. ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌ సభకు అధ్యక్షత వహిస్తారని ప్రకటించగా.. మాజీ మంత్రి రెడ్యానాయక్‌ దాన్ని వ్యతిరేకించారు. ప్రొటోకాల్‌ ప్రకారం జిల్లా అధ్యక్షురాలి చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.